భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

భాగస్వాములు కావాలి

Published Wed, Mar 5 2025 2:26 AM | Last Updated on Wed, Mar 5 2025 2:25 AM

భాగస్వాములు కావాలి

భాగస్వాములు కావాలి

ప్రకృతి వ్యవసాయంలో
ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): మానవ మనుగడకు కీలకమైన ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. దశల వారీ కార్యాచరణతో సహజ సాగులో జిల్లాను నంబర్‌1లో నిలపడానికి కృషి చేయాలన్నారు. మంగళవారం విజయవాడలోని లయోల కళాశాల ఎదురుగా ఉన్న రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో రిసోర్స్‌ పర్సన్లు, యూనిట్‌ ఇన్‌చార్జ్‌లు, మోడల్‌ మేకర్‌ ట్రైనర్లు తదితరులకు ప్రకృతి వ్యవసాయం–ఖరీఫ్‌ కార్యాచరణ ప్రణాళికపై వర్క్‌షాప్‌ జరి గింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై అన్నదాతల్లో ఉన్న అపోహలను తొలగించాలన్నారు. ఆరోగ్యకర ఉత్పత్తులతో మొత్తం సమాజానికే మేలు కలిగించే సాగు విధానాలపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ర్యాలీలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కార్యక్రమాలు, పొలం సందర్శనలు వంటివి చేయాలన్నారు. తాను సేంద్రియ వ్యవసాయంలో పీహెచ్‌డీ చేశానని.. రసాయన పురుగు మందులు, ఎరువులు క్రమేపీ మనిషి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వివరించారు. సాగులో సేంద్రియ ఎరువులు, జీవ ఉత్ప్రేరకాలు, కషాయాలు/ద్రావణాలు తదితరాల వినియోగంతో ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులు చేతికందుతాయని కలెక్టర్‌ వివరించారు. క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతి రైతుకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచాలని.. దశల వారీగా విస్తీర్ణాన్ని పెంచుతూ జిల్లాను ఆదర్శవంతంగా నిలుపుదామని పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌లోనూ రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరముందని కలెక్టర్‌ లక్ష్మీశ పేర్కొన్నారు. వర్క్‌షాప్‌నకు వచ్చిన వారితో కలెక్టర్‌.. ప్రకృతి వ్యవసాయంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి, ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు మేనేజర్‌ డీఎంఎఫ్‌ విజయకుమారి, ట్రైనర్లు డి.రవికుమార్‌, ఎ.వాణి, సీహెచ్‌ అంజిరెడ్డి, పి.రాజశ్రీ, వి.సింధు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement