వేసవిలో తాగునీటిపై ఫిర్యాదులు రాకుండా చూడాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా సమన్వయ శాఖల అధికారులు కృషిచేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. ఈ నెల 15 నాటికి జిల్లాలో తాగునీటి సరఫరా పథకాలు క్రీయాశీలం కావాలని స్పష్టం చేశారు. వేసవి తాగునీటి సరఫరా కార్యాచరణపై మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్ విస్తరణాధికారులు, గ్రామీణ నీటి సరఫరా ఇంజినీర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 286 గ్రామ పంచాయతీలు, 794 ఆవాసాల్లో 19 సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకాలు, 366 రక్షిత నీటి సరఫరా పథకాలు, 63 చిన్న రక్షిత నీటి సరఫరా పథకాలు, 439 డైరెక్ట్ పంపింగ్ పథకాలు, 7,917 చేతిపంపులు ఉన్నాయని, దాదాపు ఇవన్నీ పనిచేసే స్థితిలో ఉన్నాయని, ఇంకా ఏవైనా పునరుద్ధరణ, మరమ్మతు పనులు ఉంటే తక్షణమే పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి వనరులకు సంబంధించి ఫ్లషింగ్ లేదా పూడికతీత, బోరుబావులు, ఇతర బావులను లోతు చేయడం వంటి పనులు ఏవైనా చేయాల్సి ఉంటే క్రాష్ కార్యక్రమం ద్వారా పటిష్ట ప్రణాళికతో సత్వరమే పూర్తిచేయాలన్నారు. ఇందుకు మండల స్థాయి కమిటీలు చొరవ చూపాలన్నారు. నీటి ఎద్దడి ఉన్న ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు సిద్ధంగా ఉండాలన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లోనూ
ప్రత్యేక ఏర్పాట్లు
ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ చలివేంద్రాల కార్యకలాపాలను నిరంతరం సమీక్షించాలని, పారిశుద్ధ్య పనులూ చేపట్టాలని స్పష్టం చేశారు. రీఫిల్లింగ్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఇతర ప్రాంతాలతో పోల్చితే విజయవాడలో అధిక ఉష్ణోగ్రతలు, వేడిమి పరిస్థితులు ఉంటాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని బస్టాండ్లు, ఆసుపత్రులు, రహదారుల కూడళ్లు తదితరాల వద్ద తప్పనిసరిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా వేసవిని దృష్టిలో ఉంచుకొని తమ సిబ్బందితో పాటు బయటి నుంచి కార్యాలయాలకు వచ్చే వారికోసం తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. నరేగా పని ప్రదేశాల్లో నీడ సౌకర్యంతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. పశుపక్ష్యాదులకు నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్‌ఎం, గ్రామీణ నీటి సరఫరా సూపరింటెండింగ్ ఇంజినీర్ ఎస్.విద్యాసాగర్, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 15 నాటికి నీటి సరఫరా పథకాలు క్రియాశీలం కావాలి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment