
మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఎనిమిదో తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎన్టీఆర్ జిల్లా స్థాయి కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఇందులో భాగంగా మహిళా భద్రత, సాధికారతను ప్రతిబింబించేలా స్టాళ్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మహిళా దినోత్సవాన్ని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి వేడుకల నిర్వహణకు సంబంధించి దిశానిర్దేశం చేసేందుకు రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేడుకల నిర్వహణకు సూచనలు చేశారు. ఈ కాన్ఫరెన్స్ అనంతరం డీఆర్‌డీఏ, మెప్మా, వైద్య ఆరోగ్యం, సీ్త్ర, శిశు సంక్షేమం, పరిశ్రమలు తదితర శాఖల అధికారులతో కలెక్టర్ లక్ష్మీశ సమావేశం నిర్వహించి, శాఖల వారీగా కార్యాచరణను వివరించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయం మొదలు, రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఎన్టీఆర్ జిల్లాస్థాయి కార్య క్రమం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతుందని తెలిపారు. బ్యాంకు లింకేజీ మద్దతు, ప్రకృతి సేద్యం ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, మిల్లెట్స్ విలువ జోడింపు, మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు చేయూతనిచ్చే పథకాలు, పోషణ భద్రత, పీఎం విశ్వకర్మ, పీఎంఈజీపీ వంటి పథకాలు, లఖ్‌పతి దీదీ, డ్రోన్ దీదీ తదితరాలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక అవగాహన ర్యాలీల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, పీఓ–యూసీడీ వెంకటరత్నం, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.సుహాసిని, డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ సమన్వయకర్త డాక్టర్ జె.సుమన్, ఐసీడీఎస్ పీడీ డి.శ్రీలక్ష్మి, జిల్లా పరిశ్రమల అధికారి బి. సాంబయ్య, ఏసీపీ కె.లతాకుమారి, ఎల్‌డీఎం కె.ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment