గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్‌షిప్ (పీ4) సర్వేకు రూపకల్పన చేసిందని, ఎన్టీఆర్ జిల్లాలో ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో సర్వే జరుగుతుందని కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. బుధవారం పీ4 సర్వేపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ నెల ఆరు, ఏడు తేదీల్లో మాస్టర్ ట్రైనర్లుగా ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు తమ పరిధిలోని గ్రామ లేదా వార్డు సచివాలయ సిబ్బందికి సర్వేపై పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. టెక్ మాడ్యూల్‌తో పాటు సర్వే విధానాన్ని క్షుణ్ణంగా వివరించాలన్నారు. పేదరిక నిర్మూలనకు చేపడుతున్న కార్యక్రమాలకు ఈ సర్వే దోహదం చేస్తుందన్నారు. కుటుంబ వివరాలతో పాటు వివిధ సామాజిక, ఆర్థిక పరామితుల కచ్చితమైన సమాచారాన్ని యాప్‌లో పొందుపరచాలన్నారు. కుటుంబాలకు ఏవైనా అపోహలు ఉంటే తొలగించి, సర్వేను పది రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. సీపీఓ వై.శ్రీలత, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment