
‘ఉపాధి’ వేతన లక్ష్యాలను చేరుకోవాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం ద్వారా ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో లబ్ధిదారులకు పని కల్పించడం, దినసరి వేతనం రూ.300 అందేలా చూడడంలో నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాల్సిందేనని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి డ్వామా అధికారులతో కలిసి ఆయా మండలాల ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సిబ్బందితో కలెక్టర్ బుధవారం వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం అమలు తీరు, రోజు వారీ సగటు వేతనాలు, గ్రామాల వారీగా వేతనదారుల హాజరు, వారికి అందుతున్న వేతనం తదితరాల్లో పురోగతిని ఈ సంద ర్భంగా కలెక్టర్ లక్ష్మీశ సమీక్షించారు. పథకం ద్వారా వీలైనంత ఎక్కువ మందికి పని కల్పించడంలో పురోగతి చూపాలని సూచించారు. ఈ పథకం కింద చేపట్టేందుకు గ్రామాభివృద్ధి, వ్యక్తిగత, సామాజిక పనులను గుర్తించాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో ఉదయాన్నే పనులు ప్రారంభించాలని, పని ప్రదేశాల్లో తాగునీరు అందుబాటులో ఉంచేలా చూడా లని ఆదేశించారు. ఉపాధి పనులపై ప్రతివారం జిల్లాస్థాయిలో సమీక్ష చేస్తున్నామని పేర్కొన్నారు. ఎంపీడీఓలు అందరూ తమ మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని, క్షేత్రస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ ఎ.రాము, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, సీపీఓ వై.శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment