భవనంపై నుంచి పడి కార్మికుడు మృతి
పెనమలూరు: మండలంలోని పోరంకిలో నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు కిందకు పడి మృతి చెందాడు. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ కథనం మేరకు.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం మహారాజ్‌గంజ్ జిల్లా మహదేవ గ్రామానికి చెందిన అమిత్‌కుమార్ కొద్ది కాలం క్రితం అదే గ్రామానికి చెందిన విశాల్‌కుమార్ (23), మరి కొందరితో కలిసి పెయింటింగ్ పనులకు పోరంకి వచ్చారు. వారు పోరంకి లోని ఓ నిర్మాణ సంస్థలో ఎనిమిది అంతస్తుల భవనంలో పెయింటింగ్ పని చేస్తున్నారు. మంగళవారం పనులు ముగించుకుని అందరూ అదే భవనంలో మొదటి అంతస్తులో నిద్రపోయారు. అర్ధరాత్రి అమిత్‌కుమార్‌కు మెలకువ వచ్చి చూడగా నిద్రించిన కార్మికుల్లో విశాల్‌కుమార్ కనబడలేదు. దీంతో అందరు నిద్రలేచి అతని కోసం వెతికారు. అయితే విశాల్‌కుమార్ లిఫ్టు కోసం సెల్లార్‌లో ఏర్పాటు చేసిన గుంతలో రక్తం మడుగులో పడి శవమై కనిపించాడు. అతను అర్ధరాత్రి నిద్రలేచి పై నుంచి లిఫ్టు గుంతలో మూత్రం పోస్తూ ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడు. ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడని ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అమిత్‌కుమార్ తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు అందటంతో కేసు నమోదు చేశారు.
ఉరేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
తోట్లవల్లూరు: చెట్టుకు ఉరేసుకుని గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని చాగంటిపాడు శివారు కళ్లంవారిపాలెం వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు.. స్థానిక కృష్ణానది ఆవలి ఒడ్డున ఉన్న ఓ పొలంలోని టేకు చెట్టుకు గుర్తు తెలియన వ్యక్తి బుధవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం అందుకున్న ఎస్‌ఐ అవినాష్ ఘటనాస్థలాన్ని సందర్శించారు. మృతుడి వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతుడి ఎడమ చేతి మీద డిజైన్, బ్రూస్‌లీ అని, కుడి చేతి మీద నాయక్, ప్రేమకావాలి, కాజల్, అమ్మ, నాన్న, గంగ అని, ఛాతీపైన పోలమ్మ, కాజల్, బసవమ్మ అని పచ్చబొట్లు ఉన్నాయి. మృతుని ఒంటిపై చొక్కా, టవల్ మాత్రమే ఉన్నాయి. మొక్కజొన్న పొలాల రక్షణకు వినియోగిస్తున్న చీరతో ఉరేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీఆర్‌ఓ బాలకోటయ్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ అవినాష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
బాలికను వేధిస్తున్న ఇద్దరిపై పోక్సో కేసు
కంకిపాడు: బాలికను వేధిస్తున్న ఇద్దరిపై కంకిపాడు పోలీసుస్టేషన్‌లో పోక్సో చట్టం కింద గురువారం కేసు నమోదైంది. ఎస్‌ఐ డి.సందీప్ కథనం మేరకు.. మండలంలోని గొడవర్రు గ్రామానికి బాలుడు, మరో వ్యక్తి మేకల రాజశేఖర్ ఆదే గ్రామానికి చెందిన బాలిక వెంట పడి వేధింపులకు గురిచేస్తున్నారు. వారిపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బాలుడు, రాజశేఖర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సందీప్ తెలిపారు.
ఆర్టీసీను ఢీకొట్టిన ప్యాసింజర్ ఆటో
●ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు
● చిట్టిగూడూరు వద్ద హైవేపై జరిగిన ప్రమాదం
గూడూరు: విజయవాడ –మచిలీపట్నం జాతీయ రహదారిపై గూడూరు మండలం చిట్టిగూడూరు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సును ప్యాసింజర్ ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గూడూరు ఎస్‌ఐ కె.ఎన్.వి.సత్యనారాయణ కథనం మేరకు.. మండలంలోని ఆకుమర్రు గ్రామానికి చెందిన బొల్లా రామ్మోహన రావు(49) ప్యాసింజర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం విజయవాడ నుంచి ప్యాసింజర్లతో మచిలీపట్నం బయలుదేరాడు. చిట్టిగూడూరు వద్ద పాయింట్‌లో ఆగిన ఆర్టీసీ బస్సును ఆటో వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జవగా, డ్రైవర్ రామ్మోహనరావు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతిచెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. మల్లవోలుకు చెందిన ప్రత్తిపాటి వెంకటేశ్వరరావు, నాగమణికి తీవ్ర గాయాలవగా విజయవాడ ఆస్పత్రికి తరలించారు. జె.వెంకటేశ్వరరావు, శాంతకుమారి, సుధ మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతుండగా, దుర్గారావు గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేయించుకున్నాడు. రామ్మోహనరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
భవనంపై నుంచి పడి కార్మికుడు మృతి
భవనంపై నుంచి పడి కార్మికుడు మృతి
Comments
Please login to add a commentAdd a comment