కృష్ణలంక(విజయవాడతూర్పు): కులాంతర వివాహాలకు రక్షణ కల్పించాలని, కన్న బిడ్డలను హత్య చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి.ప్రభావతి, డి.రమాదేవి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కుప్పం నియోజకవర్గంలో ప్రేమ వివాహం చేసుకున్నందుకు కన్నకూతురిపై, మధ్యవర్తులుగా వచ్చిన వారిపై యువతి తండ్రి శివప్ప దాడిచేసిన ఘటనపై, అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో రామాంజనేయులు తన కుమార్తె భారతి ప్రేమను అంగీకరించలేక ఉరేసి చంపి, ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటనలపై త్వరితగతిన విచారణ పూర్తి చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయో ప్రభుత్వం పరిశీలన చేసి నివారణా చర్యలు చేపట్టాలని కోరారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి, చేసుకోబోయే వారికి రక్షణ, భద్రత, ఆసరా కల్పించాల్సిన ప్రభుత్వాలు మౌనం వహిస్తూ పరో క్షంగా కుల అహంకారులకు మద్దతు పలకడం దారుణమని పేర్కొన్నారు. ప్రేమగా పెంచుకున్న బిడ్డలను హత్య చేసి హంతకులుగా మార్చుతున్న కుల అహంకార ప్రచారాలపై, దళిత, ఆదివాసీలపై జరుగుతున్న దాడులపై, వివక్షతపై చర్యలు తీసుకోవాలని, నిందితులైన రామాంజనేయులు, శివప్పను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. కులాంతర వివాహం చేసుకున్న కౌసల్య, చంద్రశేఖర్‌కు కేరళ ప్రభుత్వం మాదిరిగా రూ.10 లక్షల పారితోషికం, ఇల్లు, ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ప్రేమ వివాహం చేసుకునే వారికి దండల వివాహాన్ని గుర్తించి వివాహ పద్ధతిని సులభతరం చేయాలని కోరారు. కుల ఉన్మాదాలను సమూలంగా అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment