మార్కెట్లు తరలుతున్నాయ్‌! | - | Sakshi
Sakshi News home page

మార్కెట్లు తరలుతున్నాయ్‌!

Published Fri, Mar 7 2025 9:12 AM | Last Updated on Fri, Mar 7 2025 9:09 AM

మార్క

మార్కెట్లు తరలుతున్నాయ్‌!

● వీఎంసీ సమీపంలోని పూల, కూరగాయల మార్కెట్ల తరలింపు దిశగా అడుగులు ● రైల్వే స్థలం కావడంతో ఖాళీ చేయాలని అధికారుల ఒత్తిడి ● కూరగాయల మార్కెట్‌ను నున్నలో, పూల మార్కెట్‌ వాంబే కాలనీలో ఏర్పాటు చేసే యోచన ● వ్యాపారులతో చర్చించిన సెంట్రల్‌ నియోజకవర్గ ప్రజాప్రతినిధి అనుచరులు ● నెలకు రూ. 5లక్షలు ఇవ్వాలని ప్రతిపాదన

సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ కార్పొరేషన్‌ కార్యాలయం సమీపంలో ఉన్న మార్కెట్ల తరలింపు దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం రైల్వే స్థలంలో రాజీవ్‌ గాంధీ హోల్‌సేల్‌ పూల మార్కెట్‌, రాజీవ్‌ గాంధీ హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్లు కొనసాగుతున్నాయి. 40 ఏళ్ల కిత్రం ఈ ప్రాంతంలో కూరగాయల మార్కెట్‌ తొలుత ఏర్పడింది. 1990 వరకు వన్‌టౌన్‌ పంజా సెంటర్‌ ప్రాంతంలో పూల మార్కెట్‌ ఉండేది. తర్వాత దానిని కూడా అక్కడి నుంచి వీఎంసీ కార్యాలయం పక్కన ఉన్న రైల్వే స్థలానికి తరలించారు. ఈ మార్కెట్‌లకు విజయవాడలో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది.

తరలించాల్సిందే..

రైల్వే అధికారులు గత కొంత కాలం నుంచి తమ స్థలాన్ని ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం రైల్వే డీజీఎం తమ స్థలం ఖాళీ చేసి ఇవ్వాలని గట్టిగా పట్టు పడుతుండటంతో ప్రత్యామ్నాయం వైపు దిశగా కార్పొరేషన్‌ అధికారులు అడుగులు వేస్తున్నారు. ఈ స్థలం విషయమై రైల్వే అధికారులు స్థానిక ఎంపీని సైతం కలిసి, తమ స్థలం ఖాళీ చేయించాలని ఇటీవల విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. దీంతో ఆయన సైతం రైల్వేశాఖ స్థలం వారికి అప్పగించి, మార్కెట్‌లను వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.

గతంలోనే ప్రతిపాదనలు..

గత టీడీపీ హయాంలో పూల, కూరగాయల మార్కెట్‌కు వాంబే కాలనీలోని డంపింగ్‌ యార్డు ప్రాంతంలో స్థలం కేటాయించి, షాపుల కోసం ఫౌండేషన్‌ వేసి, వదిలేశారు. అయితే ప్రస్తుతం పూల, కూరగాయ మార్కెట్‌ తరలిస్తే అక్కడే ఏర్పాటు చేయాలనే విషయంలో కార్పొరేషన్‌ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ ప్రాంతం తమకు అనువైన ప్రాంతం కాదని, పూలవ్యాపారులు అక్కడికి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపటం లేదు.

పూల మార్కెట్‌ వ్యాపారులతో..

మార్కెట్‌ తరలించే ప్రాంతం వాంబే కాలనీలో ఉండటంతో, సెంట్రల్‌ నియోజక వర్గ ప్రజాప్రతినిధికి ‘కొండ’లా ఉండే ప్రధాన అనుచరునితోపాటు, కొంత మంది ఇటీవల పూల మార్కెట్‌లో వ్యాపారులతో చర్చించినట్లు తెలిసింది. పూల మార్కెట్‌ అక్కడికి తరలితే, నెలకు ప్రజా ప్రతినిధికి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో పాటు, అక్కడ ఏర్పాటు చేసే షాపుల్లో 10 షాపులను టీడీపీ కి చెందిన అనుచరులకు ఇవ్వాలని ముందే ప్రతిపాదించారు. అక్కడ షాపులు ఏర్పాటు కాకముందే ఈ బేరాలు ఏంటని వ్యాపారులు బెంబేలెత్తి పోతున్నారు. అక్కడ సెంట్రల్‌ ప్రజా ప్రతినిధి అనుచరులతో జరిగిన చర్చల సారాంశాన్ని బయటికి వెల్లడి చేసేందుకు పూల వ్యాపారులు ఇష్టపడటం లేదు. ఫోన్‌లో వివరణ కోసం ప్రయత్నించినా కార్పొరేషన్‌ అధికారులు స్పందించలేదు.

నున్నకు తరలివెళ్తాం..

ట్రాఫిక్‌ సమస్యలతో పాటుగా ఇతర ప్రభుత్వ శాఖల సూచనలతో మేం విశాలంగా ఉండే ఇతర ప్రాంతానికి తరలివెళ్లాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా మా సంఘం తరఫున సున్నలో ఏడు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాం. అందులో దుకాణాలను నిర్మించుకున్నాం. రానున్న రెండుమూడు మాసాల్లో మా దుకాణాలను అక్కడకు తరలించేందుకు సిద్ధమవుతున్నాం. మా సంఘంలో 64 మంది సభ్యులు ఉన్నారు. అందరూ అక్కడకు తరలివస్తారు. ఇతర సంఘాలతో మాకు సంబంధం లేదు.

– సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, హోల్‌ సేల్‌ కూరగాయల మార్కెట్‌ సంఘ నేత

మేం ఇక్కడే ఉంటాం..

పాతబస్తీలోని రైల్వేస్టేషన్‌ వెస్ట్‌కింగ్‌ సెంటర్‌ సమీపంలో ఉన్న మమ్మల్ని ట్రాఫిక్‌ సమస్యలంటూ ఇక్కడకు తరలించారు. మళ్లీ ఇక్కడి నుంచి వెళ్లిపోమంటున్నారు. మేం ప్రస్తుతానికి ఎక్కడకు తరలివెళ్లటం లేదు. ఇక్కడే ఉంటున్నాం. గతంలో మా మార్కెట్లు తరలించేందుకు అధికారులు సూచనలు చేశారు. అయితే అధికారులు సూచించిన ప్రాంతం మా వ్యాపారానికి అనుకూలంగా లేకపోవటంతో తరలివెళ్లటానికి అంగీకరించలేదు. మా సంఘంలో 85 మంది సభ్యులు ఉన్నారు. – రఫీ, ఉపాధ్యక్షుడు,

హోల్‌సేల్‌ పూలమార్కెట్‌

విజయవాడ టు నున్న, వాంబే కాలనీ

కూరగాయల మార్కెట్‌ నున్నలో..

ప్రస్తుతం రాజీవ్‌ గాంధీహోల్‌ సేల్‌ కూరగాయల మార్కెట్‌లో 64 మంది వ్యాపారులు అసోసియేషన్‌గా ఏర్పడి, నున్న ప్రాంతంలో 7 ఎకరాల స్థలం కొనుగోలు చేసి, అక్కడ షాపులను సైతం నిర్మించుకున్నారు. మే నెలలో షాపులను అక్కడికి షిఫ్ట్‌ చేసేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. ఈ అసోసియేషన్‌లో లేకుండా మిగిలిన షాపుల వారు కార్పొరేషన్‌ అధికారులు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసే కూరగాయల మార్కెట్‌లో ఏర్పాటు చేసే షాపుల వైపు మొగ్గు చూపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మార్కెట్లు తరలుతున్నాయ్‌! 1
1/1

మార్కెట్లు తరలుతున్నాయ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement