‘జేఎస్‌ఎస్బీ’ ప్రగతికి కృషి చేయాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో జల్ సంచయ్ జన్ భాగీదరి (జేఎస్‌ఎస్బీ) కార్యక్రమాన్ని మరింత ముందు కు తీసుకెళ్లేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. సోమవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన న్యూఢిల్లీ నుంచి వర్చువల్‌గా జల్‌శక్తి అభియాన్–క్యాచ్ ది రెయిన్, జల్ సంచయ్ జన్ భాగీదరిపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ వీసీకి జిల్లా కలెక్టరేట్ నుంచి డ్వామా, భూర్భ జలాలు, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. జల్ సంచయ్ జన్ భాగీదరి కింద అమలవుతున్న కార్యక్రమాలు, ప్రస్తుత స్థితిగతులు, భవిష్యత్ కార్యాచరణపై మంత్రి మార్గనిర్దేశం చేశారు. వీసీ అనంతరం కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో మాట్లాడుతూ వర్షపు నీటి సంరక్షణపై ప్రతిఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరముందన్నారు. ‘ఒక రైతు–ఒక నీటి కుంట’ నినాదంతో ముందుకెళ్లాలన్నారు. జిల్లాలో 289 గ్రామ పంచాయతీల పరిధిలో 2,713 కుంటలు మంజూరయ్యాయని.. వీటి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు కృషిచేయాలన్నారు. అదేవిధంగా 440 అంగన్ వాడీ కేంద్రాల్లో రూఫ్ టాప్ వాన నీటి సంరక్షణ నిర్మాణాలు మంజూరు కాగా వీటిలో ఇప్పటికే 100 పూర్తయినందున మిగిలిన వాటిని కూడా పూర్తిచేసేందుకు కృషిచేయాలన్నారు. గత నెల మూడో శనివారం పైలెట్ ప్రాజెక్టుగా 1,350 ఇంకుడు గుంతలు మంజూరు చేశామని.. జిల్లా అంతటా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. డ్వామా పీడీ ఎ.రాము, భూగర్భ జలాల డెప్యూటీ డైరెక్టర్ నాగరాజు, గ్రామీణ నీటి సరఫరా ఎస్‌ఈ విద్యా సాగర్ తదితరులు పాల్గొన్నారు.
హెవీ వెహికల్ డ్రైవింగ్‌లో శిక్షణ పూర్తి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ది కృష్ణాజిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న డ్రైవింగ్ స్కూల్‌లో హెవీ వెహికల్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సోమవారం సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చాంబ ర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొని సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో రవాణా వ్యయం జి.డి.పి.లో 8 శాతమే ఉండగా, మన దేశంలో 14 శాతం ఉండటం వల్ల ఎగుమతుల పరంగా పోటీపడలేని స్థితి నెలకొందన్నారు. రహదారిపై వాహనం నడిపేవారు సమయ స్ఫూర్తి, ఓర్పు, సహనం ఎల్లవేళలా కలిగి ఉంటే రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉండదన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు నాగుమోతు రాజా, ఉపాధ్యక్షుడు కె.వి.ఎస్.చలపతిరావు, కార్యదర్శి రావి శరత్ బాబు, కోశాధికారి పొట్లూరి చంద్రశేఖరరావు, లారీ ఓనర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షులు కోనేరు జగదీశ్వరరావు పాల్గొన్నారు.
‘జేఎస్‌ఎస్బీ’ ప్రగతికి కృషి చేయాలి
Comments
Please login to add a commentAdd a comment