జిల్లా వ్యాప్తంగా దాతల సాయంతో చలివేంద్రాలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వేసవి లో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. దాతల సహకారంతో జిల్లా వ్యాప్తంగా మజ్జిగ, తాగునీటిని సరఫరా చేసేలా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి విచ్చేసే సందర్శకులు, అధికారులు, సిబ్బందికి దాహార్తిని తీర్చేందుకు ఆపద్బాంధవులు ట్రస్ట్ సహకారంతో కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరం వద్ద మజ్జిగ సరఫరా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం కలెక్టర్ లక్ష్మీశ ఆపద్బాంధవులు ట్రస్ట్ నిర్వహకుడు శ్రావణ్‌రెడ్డితో కలిసి మజ్జిగ కేంద్రా న్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 286 గ్రామ పంచాయతీలు, 794 ఆవాసాల్లో 19 సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకాలు, 366 రక్షిత నీటి సరఫరా పథకాలు, 63 చిన్న రక్షిత నీటి సరఫరా పథకాలు, 439 డైరెక్ట్ పంపింగ్ పథకాలు, 7,917 చేతి పంపులు ఉన్నాయని.. వీటితో పాటు 44 ప్రభుత్వ, 594 ప్రైవేట్ ఆర్వో ప్లాంట్స్ ద్వారా తాగునీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. ఎద్దడి ఉన్న ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. బస్టాండ్లు, ఆసుపత్రులు, రహదారుల కూడళ్లు తదితర ప్రదేశాల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామని, ఇందుకు అవసరమైతే దాతల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం. నరసింహరావు, డీఎం అండ్‌హెచ్‌ఓ డాక్టర్ ఎం. సుహాసిని, డీఆర్డీఏ పీడీ కె. శ్రీనివాసరావు పాల్గొన్నారు.
వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment