సర్వేలతో ఉద్యోగుల్లో కలవరం
తిరువూరు: రాష్ట్రప్రభుత్వం క్షేత్రస్థాయి ఉద్యోగులపై సర్వేల పేరుతో తీవ్ర పనిభారం మోపుతోందని తిరువూరు డివిజన్లోని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సచివాలయాలు, పంచాయతీలలో పని చేసే కార్యదర్శులు గ్రూప్–1, గ్రూప్–2 తదితర ఉద్యోగాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిమిత్తం సెలవుపై వెళ్లడంతో ఉన్న ఉద్యోగులపై అదనపు భారం పడుతోంది. ఉదయం ఆరు గంటలకు యాప్స్ తెరిచి హాజరు నమోదుచేయడంతో పాటు నిర్ణీత లక్ష్యం చేరుకునే వరకు సమయంతో పని లేకుండా పనిచేస్తూనే ఉండాలని అధికారుల ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇవికాక రోజు వారీ విధుల్లో పాల్గొనడం, సోమవారం పీజీఆర్‌ఎస్‌కు హాజరవడం, ఉన్నతాధికారుల జూమ్ కాన్ఫరెన్సులు, ఫోన్ కాన్ఫరెన్సులతో క్షణం తీరిక లేకుండాపోతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాప్‌లకు సాంకేతిక లోపంతో ఓటీపీలు రాకపోవడం, సమాచారం నిక్షిప్తం కాకపోవడం, సర్వేకు వెళ్లిన ఇంటిలో కుటుంబసభ్యులు సమాధానం చెప్పడానికి నిరాకరించడం వంటి పలు సమస్యలు వెంటాడుతున్నాయని పేర్కొంటున్నారు. మండల కేంద్రానికి 30, 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు సర్వేకు వెళ్లిన సమయంలో అధికారుల సమీక్షలు, సమావేశాలకు పిలవడంతో దూరాభారమైనా పరుగులు పెట్టి రావాల్సి వస్తోందని గంపలగూడెం మండలంలోని ఉద్యోగులు చెబుతున్నారు.
ఏ ఏ సర్వేలు చేయాలంటే..
పురపాలక శాఖలో ఎంఎస్‌ఎంఈ, ఇళ్ల జియోట్యాగింగ్, నాన్ ఏపీ కుటుంబాల వలస సర్వే, ఇతర శాఖల ఈకేవైసీ, వర్క్ ఫ్రం హోం ఈకేవైసీ, ఆధార్ లేని పిల్లల వివరాల సేకరణ, పీ4 సర్వేలు ఉద్యోగులను క్షణం తీరిక లేకుండా చేస్తున్నాయి. వైద్యా రోగ్య శాఖలో ఎన్‌సీడీలో 3.0, ఆర్సీహెచ్, ఇమ్యూనైజేషన్, ఫీవర్‌సర్వే, ఎన్‌ఎల్‌ఈపీ, శానిటేషన్ డ్రైడే ఫ్రైడేతో పాటు ఏఎన్‌ఎంలకు హెల్త్ యాప్‌లో రెగ్యులర్ సర్వేలు, యాంటినాటల్ విజిట్స్, కిశోరబాలికల 4డీ స్క్రీనింగ్ టెస్టులు కలిపి 70 సర్వేలు ఏకకాలంలో చేయాల్సి ఉంది. పంచాయతీరాజ్ శాఖలో పీ4 సర్వే, ఇంటి పన్నులు, కుళాయి పన్నుల వసూలు, ఖాళీ స్థలాలపై పన్నులను వసూలు చేసే బాధ్యతలు కూడా కార్యదర్శులపైనే ఉంచారు.
పంచాయతీరాజ్, ఆరోగ్యశాఖలఉద్యోగులపై తీవ్ర వత్తిడి రోజుకు 80 ఇళ్లు సర్వే చేయాలని ఆదేశాలు సమయంలేక కుటుంబానికిదూరమవుతున్నామని ఆవేదన
ఇంటికి వెళ్లేదెప్పుడు?
అధికారులు ఉదయం 10.30 గంటలకు కార్యాలయానికి వచ్చి సాయంత్రం ఐదు గంట లకు ఇళ్లకు వెళ్లిపోతుండగా, క్షేత్రస్థాయి సిబ్బందికి మాత్రం వేళాపాళా లేకుండా విధులు అప్పగిస్తున్నారని పలువురు వాపో తున్నారు. పర్యవేక్షణ అధికారులు తమను తీవ్ర వత్తిడికి గురిచేస్తుండటంతో పలువురు ఉద్యోగులు సెలవుపై వెళ్లిపోతున్నారు. సర్వే లలో తలమునకలై తమ కుటుంబసభ్యులతో కనీసం కొద్దిసేపైనా గడిపే పరిస్థితి లేకుండా పోయిందని మహిళా ఉద్యోగులు కన్నీటి పర్యంతమవుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడినవారు, వృద్ధాప్యదశలో ఉన్న ఉద్యోగులు ఈ సర్వేలు చేయడంలో వెనుకబడుతుండటంతో అధికారులతో చీవాట్లు తినాల్సి వస్తోంది.
సర్వేలతో ఉద్యోగుల్లో కలవరం
Comments
Please login to add a commentAdd a comment