సమస్యలు పరిష్కరించాలని ధర్నా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలోని మునిసిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకటసుబ్బయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ మునిసిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి చలో విజయవాడ కార్యక్రమం జరిగింది. ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆసుల రంగనాయకులు, ఉప ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ నగరపాలక సంస్థలో వేలాదిమంది కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. థర్డ్ పార్టీ కాంట్రాక్టు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో 14 రోజులు సమ్మె సందర్భంలో కార్మికులను పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉంటే ఓ మాట, అధికారం వచ్చాక మరొక మాట సబబు కాదని ప్రభుత్వానికి హితవుపలికారు. అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్స్ నగదు చెల్లించాలని, డీఏలు విడుదల చేయాలని, జనాభా ప్రాతిపదికన అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులను పెంచాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరుమామిళ్ల సుబ్బారాయుడు, గౌరవ సలహాదారులు నెక్కంటి సుబ్బారావు, వీఎంసీ ఉపాధ్యక్షులు బిందెల రవికుమార్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కె. మల్లేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment