కార్మికుల భద్రతే రాష్ట్ర భద్రత
మధురానగర్(విజయవాడసెంట్రల్): కార్మికుల భద్రతతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ కల సాకారం అవుతుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. 54వ జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా పరిశ్రమలలో భద్రతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని పరిశ్రమలు, కొండపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్, ఇతర సంస్థలు బీఆర్టీఎస్ రోడ్డులో ఇండస్ట్రీయల్ సేఫ్టీపై వాక్‌థాన్ నిర్వహించాయి. కార్యక్రమంలో మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించి భద్రతా వారోత్సవాలను ప్రారంభించారు. అనంతరం బెలూన్‌లను గాలిలోకి వదలి వారోత్సవాల ప్రాధాన్యతను వివరించారు. కార్మికులతో భద్రతా శపథం చేయించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఏపీ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి. చంద్రశేఖర్ వర్మ, ఎన్టీఆర్ జిల్లా ఫైర్ ఆఫీసర్ ఏవీ శంకరరావు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా డెప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎం. శివకుమార్ రెడ్డి, కొండపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొని భద్రత ప్రాముఖ్యతను వివరించారు.
యాజమాన్యాల బాధ్యత..
అనంతరం సత్యనారాయణపురం రైల్వే కమ్యూనిటీ హాల్లో జరిగిన సమావేశంలో మంత్రి వాసంశెట్టి మాట్లాడుతూ యాజమాన్యాల చేతిలో కార్మికుల ప్రాణాలు ఉంటాయని యాజమాన్యాలు కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భద్రతా వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన పోటీలలో విజేతలకు మంత్రి చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. కార్యక్రమంలో అసోసియేట్ ప్రతినిధి రామచంద్రరావు, రామ్స్ ప్లాంట్ హెడ్ ఆశిష్ కుమార్, కెసీపీ ప్లాంట్ హెడ్ మధుసూదన రావు, జాయింట్ చీఫ్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి వాసంశెట్టి సుభాష్
ముగిసిన 54వ జాతీయ భద్రతా వారోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment