సమన్వయంతో మాదకద్రవ్యాల కట్టడి
విజయవాడస్పోర్ట్స్: అన్ని ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలను సమన్వయం చేసుకుని జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసు అధికారులు కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు సూచించారు. మినిస్టరీ ఆఫ్ సోషల్ జస్టిస్, ఎంపవర్మెంట్–గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై పోలీసు అధికారులకు కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు సరఫరా చేసే ముఠాల ఆట కట్టించడానికి పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదక ద్రవ్య వినియోగ సమస్యను ఎదుర్కోవడానికి టాస్క్ ఫోర్స్, ఈగల్ టీం, నార్కోటిక్ సెల్ వంటివి పని చేస్తున్నాయని, త్వరలో సరికొత్త ప్రణాళికతో కమిషనరేట్‌లో మాదక ద్రవ్య వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలనే లక్ష్యంతో ఈ వర్క్ షాప్ నిర్వహించామని తెలిపారు.
మొదట అలవాటు.. తర్వాత బానిస..
జీజీహెచ్ వైద్యురాలు డాక్టర్ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ డ్రగ్స్ తరచూ వినియోగించే వారి మెదడులోని రివార్డుపాత్వే అనే భాగం సిగ్నల్ ఇవ్వడం ద్వారా తరచూ వాటికి అలవాటు పడి చివరిగా బానిసలు అవుతున్నారని వివరించారు. ఈ డ్రగ్స్ వినియోగం శరీరంలోని ఊపిరితిత్తులు, కిడ్నీ, మెదడు, కళ్లు తదితర అవయవాలపై దుష్ప్రభావం చూపుతుందన్నారు. క్యాన్సర్, లుకేమియా వంటి వ్యాధుల బారిన పడతారని హెచ్చరించారు. ప్రస్తుతం పాత గవర్నమెంట్ హాస్పిటల్‌లో సైక్రియాటిక్ విభాగంలో డీ అడిక్షన్‌పై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ డాక్టర్ కల్యాణి మాట్లాడుతూ ఎన్‌డీపీఎస్ యాక్ట్‌లో కేసులు నమోదు చేసేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కె.జి.వి.సరిత, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ చైర్ పర్సన్ ఉమారాజ్, టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ ఎ.శ్రీనివాసరావు, ఏసీపీలు ఉమామహేశ్వరరెడ్డి, కిరణ్ పాల్గొన్నారు. వర్క్‌షాప్‌కు హాజరైన అధికారులు, సిబ్బందికి సర్టిఫికెట్‌లు అందజేశారు.
ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖరబాబు
Comments
Please login to add a commentAdd a comment