
మూల్యాంకన పారితోషికం సకాలంలో ఇవ్వాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పదో తర గతి మూల్యాంకన విధులు ముగిసిన వెంటనే ఉపాధ్యాయులకు పారితోషికం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధి కారి యు.వి సుబ్బారావును డీపీఆర్టీయూ ప్రతినిధులు కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డి.శ్రీను ఆధ్వర్యంలో నాయకులు డీఈఓను బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ.. విజయవాడకు దూరంగా ఉన్న గంపలగూడెం, తిరువూరు, విస్సన్నపేట, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల ఉపాధ్యాయులకు వారి ఆసక్తిని బట్టి మూల్యాంకన విధులు కేటాయించాలని, గర్భిణులు, పసి బిడ్డల తల్లులకు మూల్యాంకన విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. తమ వినతిపై డీఈఓ సానుకూలంగా స్పందించారని శ్రీను తెలిపారు. సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు మర్రి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి పి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
బహిరంగ వేలంలో రూ. 27.48 లక్షల ఆదాయం
పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మవారి ఆలయం వద్ద ఏడాది కాలంలో వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో రూ.27.48 లక్షల ఆదాయం వచ్చిందని ఈఓ కిషోర్‌కుమార్ తెలిపారు. ఆలయంలో ఫొటలు తీసుకునే హక్కును రూ.8.50 లక్షలకు కె.శ్రీనివాసరావు), చాపలు ఆద్దెకిచ్చే హక్కును రూ.88 వేలకు కె.అజయకుమార్, భక్తుల సామాన్లు, పాదరక్షలు భద్రపరిచే హక్కును రూ.3 లక్షలకు జి.గోపినాథ్, నూతనంగా నిర్మించిన సులభ్ కాంప్లెక్స్ నిర్వహణ హక్కును రూ.8.12 లక్షలకు ఎన్నురేష్ దక్కించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో 20 దుకాణాల నిర్వహణకు వేలంలో రూ.6,98,000 ఆదాయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జంగాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.