
పింఛన్ల పంపిణీని పరిశీలించిన కలెక్టర్
నందిగామరూరల్: గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారుల పర్యవేక్షణలో లబ్ధిదారులకు పింఛన్‌లు అందిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. మండలంలోని ఐతవరం గ్రామంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్‌ల పంపిణీ ప్రక్రియను మంగళవారం వారు పరిశీలించారు. కేటగిరీల వారీగా లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని అందిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు, పూర్తి స్తాయిలో పేదరిక నిర్మూలనకు జిల్లా స్థాయి ప్రణాళికల అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో బాలకృష్ణ, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
33 మందికి జరిమానా
విజయవాడలీగల్: మద్యం తాగి వాహనాలు నడిపిన 33 మందికి ఆరవ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి లెనిన్‌బాబు జరిమానా విధించారు. నగర పోలీసు కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు నగరంలో అయిదవ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన వారిలో 14 మందికి ఒక్కొక్కరికి రూ.15వేలు, 19 మందికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున జరిమానా విధించారు. ప్రతిరోజు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించి, పట్టుబడిన వారిపై కేసులు నమోదుచేస్తామని, వాహనచోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.