ఇష్టారాజ్యంగా ఉపాధి | - | Sakshi
Sakshi News home page

ఇష్టారాజ్యంగా ఉపాధి

Apr 2 2025 1:23 AM | Updated on Apr 2 2025 1:23 AM

ఇష్టారాజ్యంగా ఉపాధి

ఇష్టారాజ్యంగా ఉపాధి

శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం

ఫీల్డ్‌ అసిస్టెంట్లకు వారు చేయవలసిన విధులపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు క్లస్టర్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చాం. ప్రతి బుధవారం ఎంపీడీవో కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్‌ కొలతలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఫీల్డ్‌ అసిస్టెంట్లకు అవగాహన ఇస్తున్నాం. కొలతల్లో తప్పులు ఉంటే చర్యలు తీసుకుంటాం.

–ఎ.రాము, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌,

డ్వామా, ఎన్టీఆర్‌ జిల్లా

రూ.5లక్షలు ఇచ్చుకుంటేనే ఎఫ్‌ఏ గా కొనసాగేది

జగ్గయ్యపేట: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను ఇష్టారాజ్యంగా తొలగించి వారికి నచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వడంతో కూలీలకు కొలతల భయం వెంటాడుతోంది. కొత్తగా వచ్చిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌లకు వారి విధులపై సరైన అవగాహన లేకపోవడంతో పాటు కనీసం స్మార్ట్‌ ఫోన్‌లో యాప్‌ల వినియోగం కూడా తెలియకపోవడంతో కొలతల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని గ్రామాల్లో కూలీలు ప్రశ్నిస్తున్నప్పటికీ తాము చెప్పిందే వినాలని, లేకపోతే పనుల నుంచి తీసేస్తామంటూ బెదిరిస్తుండటంతో చేసేది లేక కూలీలు మిన్నకుంటున్నారు.

జిల్లా వ్యాప్తంగా 271 మంది ఫీల్ట్‌ అసిస్టెంట్‌లు

ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా 16 మండలాలను మూడు క్లస్టర్లుగా విభజించారు. విస్సన్నపేట క్లస్టర్‌లో ఎ.కొండూరు, గంపలగూడెం, విస్సన్నపేట, తిరువూరు, రెడ్డిగూడెం, విజయవాడ క్లస్టర్‌ పరిధిలో జి.కొండూరు, మైలవరం, ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్‌, కంచికచర్ల, నందిగామ క్లస్టర్‌ పరిధిలో నందిగామ, వీరులపాడు, చందర్లపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లోని ఆయా గ్రామాల్లో 271 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు పని చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం రాగానే 130 మందిని తొలగించారు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామాల్లో టీడీపీ నాయకులు వారి ఇష్టారాజ్యంగా ప్రస్తుతం ఫీల్డ్‌ అసిస్టెంట్‌లుగా పనిచేస్తున్న వారిని తొలగించి వారికి ఇష్టమైన వారిని నియమించుకున్నారు. జిల్లాలో ఉన్న 271 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లలో 130 మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. మిగిలిన 141 మందిని కూడా తొలగించేందుకు సమాయత్తం అవుతున్నారు. కొన్ని గ్రామాల్లో పాతవారిని కొనసాగించాలంటే రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు సమర్పించుకోవాలని అధికార పార్టీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, చందర్లపాడు, తిరువూరు మండలాల్లో ఈ మేరకు డిమాండ్‌ కూడా చేసినట్లు బహిరంగంగానే అంటున్నారు.

కూలీలకు తప్పని కొలతల పాట్లు

గ్రామాల్లో కొత్తగా వచ్చిన ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఉపాధి పథకంపై పూర్తిగా అవగాహన లేకపోవడంతో కూలీలకు కొలతలు కేటాయించే విషయంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ప్రతి కూలీకి రోజుకు ప్రభుత్వం ఇచ్చే రూ.300 వేతనం అందేలా కొలతలు కేటాయించాలి. అయితే కొత్తగా వచ్చిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు కొలతలపై అవగాహన లేకపోవడంతో రోజువారీగా రూ.100 లేక 150 వేతనం వచ్చేలా కొలతలు ఇస్తుండటంతో కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇదేమని మండల స్థాయి అధికారులను అడిగినప్పటికీ వారి నుంచి కూడా సరైన సమాధానం రావడంలేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రికార్డుల నిర్వహణ అధ్వానం...

జిల్లాలో అన్ని గ్రామాల్లో గత కొన్ని నెలల నుంచి రికార్డులు అధ్వానంగా ఉంటున్నాయి. ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు ఏడు రకాల రికార్డులు నిర్వహించాల్సి ఉండగా అవి ఎక్కడా సక్రమంగా జరగడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల జిల్లా అధికారులు కూడా పలు గ్రామాల్లో పనుల తనిఖీల సమయంలో ఈ విషయం గుర్తించారు. ముఖ్యంగా జాబ్‌కార్డుల నమోదు, గ్రామసభ నిర్వహణ, గ్రామాల్లో పని కావలసిన వారి దరఖాస్తు, పని ఇచ్చింది, కేటాయించింది, పని తాలుకా రిజిస్టర్‌, మెటీరియల్‌ రిజిస్టర్‌, పనుల స్థిరాస్తులు, పనుల్లో కూలీల ఫిర్యాదులు వంటి వాటికి సంబంధించిన రిజిస్టర్లు నిర్వహించాల్సి ఉండగా అవి ఎక్కడా అమలు కావడంలేదు.

యంత్రాలతో పనులు చేస్తున్నట్లు ఆరోపణలు...

గ్రామాల్లో మట్టి పనులు, నీటి కుంటలు, చెరువు పూడికతీత, మట్టి రోడ్లు బాగుచేయడం, బీడు భూములు చదును చేయడం, జంగిల్‌ క్లియరెన్స్‌, గడ్డి పెంపకాలు వంటి పనులు ఉపాధి కూలీలు చేయవలసి ఉండగా కొన్ని గ్రామాల్లో యంత్రాలతో పని చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామం పట్టి రోడ్లు బాగుచేసే విషయంలో కూలీలకు బదులు యంత్రాలతో పనులు చేస్తుండగా మండల స్థాయి అధికారులకు తెలియడంతో ఆ పనికి సంబంధించిన బిల్లులు నిలిపివేశారు.

పని చేయకుండానే మేట్లకు వేతనాలు చెల్లింపు...

కూలీలతో పాటు మేట్లు పనులు చేయాల్సి ఉండగా మేట్లు మాత్రం కూలీలపై పెత్తనం చెలాయిస్తున్నారు. పనులు చేయకుండా రోజువారీ వేతనం తీసుకుంటున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ జి.కొండూరు మండలం చెవులూరులో ఉపాధి పనుల పరిశీలనకు వెళ్లినప్పుడు మేట్లు ఖాళీగా ఉండటం గమనించి కూలీలతో పాటు మీరు కూడా పని చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల ఒత్తిడులు ఇప్పటికే దాదాపు సగం మంది ఫీల్డ్‌ అసిస్టెంట్ల తొలగింపు అవగాహన లేని వారికి కొత్తగా పోస్టింగ్‌లు కూలీలకు తప్పని కొలతల పాట్లు కూటమి ప్రభుత్వ నిర్వాకం అధికారులకు తప్పని కష్టాలు

జిల్లా సమాచారం...

మొత్తం జాబ్‌ కార్డులు ... 1,56,521

కూలీల సంఖ్య ... 2,68,555

పని దినాలు ... 79,90,793

100 రోజులు పూర్తి

చేసుకున్న కుటుంబాలు ... 10,696

మేట్లు ... 2,033

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement