
చరిత్ర తిరగరాసిన రైల్వే డివిజన్
సరుకు లోడింగ్, ఆదాయార్జనలో
సరికొత్త రికార్డు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం, సరుకు లోడింగ్, రైళ్ల సమయపాలనలో సరికొత్త రికార్డు సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 38.322 మిలియన్ టన్నుల సరుకు లోడింగ్ నమోదు చేసు కుంది. దశాబ్దం తర్వాత 2014–15 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 38.169 మిలియన్ టన్నులను అధిగమించింది. తద్వారా సరుకు లోడింగ్ ద్వారా డివిజన్ రూ.4,239.74 కోట్లు ఆదాయం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం కంటే 3.8శాతం వృద్ధితో డివిజన్ స్థూల ఆదాయం రూ. 5,836.61 కోట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ డివిజన్ సాధించిన ఉత్తమ ఫలితాలకు కారణమైన సరుకు వినియోగదారులు, ప్రయాణికులకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా విధుల్లో అంకితభావంతో పనిచేసిన సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, సీనియర్ డీఓఎం డి.నరేంద్ర వర్మ తదితరులను అభినందించారు.
2024–25లో డివిజన్ వృద్ధి ఇలా..
● ప్రయాణికుల ద్వారా గతం కంటే 0.12శాతం వృద్ధితో రూ. 1,386.14 కోట్లు
● కోచింగ్ ఆదాయం 18శాతం వృద్ధితో రూ. 111.70 కోట్లు
● ఇతర ఆదాయ మార్గాల ద్వారా 18శాతం వృద్ధితో రూ. 99.03 కోట్లు
● 66.7 మిలియన్‌ల ప్రయాణికులు డివిజన్ నుంచి ప్రయాణించారు. గతంలో 63.6 మిలియన్‌లు ఉండగా 4.8 శాతం ప్రయాణికులు పెరిగారు.
● డివిజన్ రైళ్ల నిర్వహణలో 80.19శాతం అత్యుత్తమ సమయపాలన నమోదు చేసుకుంది.