
దుర్గమ్మకు మల్లెలు, చామంతులతో అర్చన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో చైత్రమాస వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మూడో రోజైన మంగళవారం దుర్గమ్మకు పసుపు, తెలుపు చామంతులు, మల్లెలతో ప్రత్యేక పుష్పార్చన జరిగింది. అమ్మవారి ఆలయంలోని పూజా మండపంలో ఉత్సవమూర్తికి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు పుష్పాలతో అర్చన నిర్వహించారు. తొలుత మహా మండపం నుంచి ఊరేగింపుగా ఆలయ డీఈవో రత్నరాజు, అర్చకులు, అధికారులు పూల గంపలతో ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారి మూలవిరాట్‌ను దర్శించుకున్న అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పూజా మండపానికి చేరుకున్నారు. పూజా మండపంలో ఆలయ అర్చకులు పూలతో అర్చన నిర్వహించారు. జపాన్ దేశం టోక్యోకు చెందిన ఇద్దరు భక్తులు ప్రత్యేక పుష్పార్చనలో పాల్గొన్నారు. విజయవాడ సందర్శనకు వచ్చిన వారు అమ్మవారి ఆలయం గురించి తెలుసుకొని వచ్చి పూజలు చేశారు. వీరితో పాటు పలువురు ఉభయదాతలు, భక్తులు పూజలో పాల్గొనగా, వారిని ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు.