
సత్వరమే పారిశ్రామిక అనుమతులు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సత్వర పారిశ్రామిక అనుమతుల జారీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పారిశ్రామిక విధానాల కింద పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పారిశ్రామిక అనుమతులు తదితరాలపై చర్చించారు. 2024, డిసెంబర్ 19 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పారిశ్రామిక అనుమతులకు సంబంధించి 105 దరఖాస్తులు అందాయని, వాటిలో ఇప్పటికే 90 ఆమోదం పొందాయని పరిశ్రమల శాఖ అధికారులు వివరించారు. మిగిలిన దరఖాస్తులను కూడా నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పారిశ్రామిక అభివృద్ధి విధానం– 2015–20, 2020–23, 2023–27 కింద ఎంఎస్‌ఎంఈ రంగానికి అందించే ప్రోత్సాహకాలపై స్క్రూట్నీ కమిటీ సమావేశాలు నిర్వహించి 46 క్లయిమ్‌లకు రూ. 3.20 కోట్ల మేర ప్రతిపాదనలు పంపాయన్నారు. ఈ ప్రాతిపాదనలపై తాజాగా చర్చించి డీఐఈపీసీ ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఎంఈజీపీ వంటి పథకాలను సద్వినియోగం చేసుకుంటూ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య, ఎల్‌డీఎం కె.ప్రియాంక, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కె.బాబ్జి, డీపీవో పి.లావణ్యకుమారి, పీసీబీ ఈఈ పి.శ్రీనివాసరావు, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావు పాల్గొన్నారు.