
బీబీఏ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
విజయవాడలీగల్: ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బెజవాడ బార్ అసోసియేషన్ ఎన్నికలలో విజయం సాధించిన నూతన కార్యవర్గం బుధవారం ప్రమాణస్వీకారం చేసింది. నగరంలోని సిటీ కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న బెజవాడ బార్ అసోసియేషన్ హాలులో ప్రధాన ఎన్నికల అధికారి డి.పి.రామకృష్ణ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. 2025–2026వ సంవత్సరానికి నూతన అధ్యక్షునిగా అబ్దుల్ ఖుద్దూస్ బాషా (ఏకే బాషా), ఉపాధ్యక్షునిగా పిళ్లా శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కె.వి.రంగారావు, జాయింటు సెక్రటరీగా జి.వరాహలక్ష్మి, కోశాధికారిగా ముద్దాడ సత్యనారాయణ, లైబ్రరీ కార్యదర్శిగా కంచర్ల త్రినాథ్‌కుమార్, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా పల్లగాని రవిబాబు, మహిళా కార్యదర్శిగా కొప్పరాపు అనురాధ, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మాజీ అధ్యక్షుడు చంద్రమౌళి బాషాను తోడ్కొని వెళ్లి చాంబర్‌లో బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా బాషా మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన బెజవాడ బార్‌కు తనను నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. బార్‌కి, బెంచికి మధ్య స్నేహపూర్వక వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. బార్ అసోసియేషన్‌లో ఉన్న సమస్యలను తోటి న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదుల సలహాలు, సూచనలతో పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు. ఏపీ హైకోర్టు నూతన అధ్యక్షుడు చిదంబరం మాట్లాడుతూ బెజవాడ బార్ అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు సహాయం చేస్తానని తెలిపారు. కార్యక్రమానికి స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు చలసాని అజయ్‌కుమార్, సుంకర రాజేంద్రప్రసాద్, గుర్నాథం, సీహెచ్.మన్మధరావు, సరళా బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.