
విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విద్యార్థులు పారి శ్రామికవేత్తలుగా ఎదగాలని ఎన్టీఆర్ జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ మైనం హుస్సేన్, బీసీబీ కార్య దర్శి ఉమర్‌అలీ ఆకాంక్షించారు. జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఎంట్రపెన్యూరియల్ మైండ్‌సెట్ డవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రాజెక్ట్‌ల ప్రదర్శన బిషప్ అజరయ్య హైస్కూల్‌లో బుధవారం జరిగింది. జిల్లాలోని వివిధ జెడ్పీ హైస్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులు తయారు చేసిన సబ్బులు, జ్యూట్ సంచులు, వ్యర్థాలతో ఇటుకలు, నీటి శుద్ధి ప్రాజెక్టులను ప్రదర్శించారు. మైనం హుస్సేన్, ఉమర్‌అలీ మాట్లాడుతూ.. ప్రతి శుక్రవారం పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి అవసరమైన ఆలోచనలు, ఉత్పత్తుల తయారీ తదితర అంశాలపై తొమ్మిదో తరగతి విద్యార్థులకు శిక్షణ ఉంటుందన్నారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందించారు. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జె.భానుకిరణ్ పాల్గొన్నారు.
‘సుజన మిత్ర’తో
సమస్యల పరిష్కారం
భవానీపురం(విజయవాడపశ్చిమ): పశ్చిమ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి సుజన మిత్ర వ్యవస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమని మునిసిపల్ శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. ఎమ్మెల్యే సుజనచౌదరితో కలిసి భవానీపురంలో ఏర్పాటు చేసిన సుజన మిత్ర కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. సుజన ఫౌడేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 22 డివిజన్లలో కోఆర్డినేటర్లను నియమించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే వ్యవస్థను రూపొందించి వారందరికీ ఎలక్ట్రిక్ బైక్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధాకృష్ణ, సామినేని ఉదయభాను, టీడీపీ నాయకులు నాగుల్‌మీరా, ఎంఎస్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.