
రైలులో గంజాయి తరలిస్తున్న నిందితుడి అరెస్ట్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలులో గంజాయి అక్రమంగా తరలిస్తున్న నిందితుడిని ప్రభుత్వ రైల్వే పోలీసులు(జీఆర్పీ) అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జీఆర్పీ సిబ్బంది గురువారం విజయవాడ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 1వ నంబర్ ప్లాట్‌ఫాం దక్షిణం వైపు చివరలో ఒక యువకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న బ్యాగును సోదా చేయగా అందులో ఏడు కేజీల గంజాయి లభ్యమైంది. నిందితుడిని అంబాపురానికి చెందిన సందునపల్లి రాంబాబుగా గుర్తించారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి వాటిని చిన్న పొట్లాలుగా కట్టి నగరంలో అధిక ధరకు విక్రయిస్తుంటాడు. ఒడిశాలోని గంజాం జిల్లాలో చందు అనే వ్యక్తి నుంచి రాంబాబు గంజాయి కొనుగోలు చేసి రైలులో విజయవాడ చేరుకోగా రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంబాబును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
వంశీ బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
గన్నవరం: కృష్ణాజిల్లా ఆత్కూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన స్థల వివాదం కేసులో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై స్థానిక 8వ అదనపు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో గురువారం వాదనలు పూర్తయ్యాయి. ఉంగుటూరులోని ఓ స్థలం వివాదంపై తేలప్రోలుకు చెందిన శనగల శ్రీధర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్కూరు పీఎస్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 24న కేసు నమోదైంది. విజయవాడ జిల్లా జైలులో ఉన్న వంశీమోహన్‌ను పీటీ వారెంట్‌పై ఆత్కూరు పోలీసులు ఇటీవల స్థానిక కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో వంశీమోహన్ బెయిల్‌పై దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టులో గురువారం తుది విచారణ జరిగింది. ఇరువైపులా న్యాయవాదుల సుదీర్ఘ వాదనలు విన్న జడ్జి బి.శిరీష తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేశారు.