
మహిళ ప్రాణాలు కాపాడిన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళను ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది కాపాడి ఒడ్డుకు చేర్చిన సంఘటన బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే ప్రకాశం బ్యారేజీలోని 67వ కానా నుంచి మహిళ నదిలోకి దూకింది. ఆమెను గమనించిన స్థానిక పాదచారులు అక్కడ విధులు నిర్వహిస్తున్న 16వ బెటాలియన్ ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందికి సమాచారమందించారు. వారు వెంటనే దుర్గాఘాట్ వద్ద డ్యూటీలో ఉన్న వారిని అప్రమత్తం చేయటంతో వారు బోటుతో నదిలోని సంఘటనా స్థలానికి చేరుకొని ఆమెను పట్టుకున్నారు. అదే సమయంలో ఇతర సిబ్బంది బ్యారేజీ పైనుంచి తాడు విసరటంతో ఆమెను బోటులోకి ఎక్కించి ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం వన్‌టౌన్ పోలీసుస్టేషన్ సిబ్బందికి సమాచారమందించి వారికి అప్పగించారు. ఈ సందర్భంగా సిబ్బందిని బెటాలియన్ ఎస్పీ రాజకుమారి అభినందించారు. నదిలోకి దూకిన మహిళ యనమలకుదురుకు చెందిన 29 సంవత్సరాల మేక దివ్య అని గుర్తించారు. ఆమె కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. ఆమె కుటుంబ సభ్యులను పిలిచి ఆమెను అప్పగించారు.
వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు
విజయవాడలీగల్: కృష్ణా జిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్‌ను ఈ నెల 23వ తేదీ వరకు న్యాయస్థానం పొడిగించింది. ఈ కేసులో ఏ71గా ఉన్న వంశీ ప్రస్తుతం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సీఐడీ అధికారులు దాఖలు చేసిన కేసులో బుధవారం రిమాండ్ ముగియడంతో వంశీ సహా 12 మందిని కోర్టులో హాజరుపరచగా ఈ నెల 23వ తేదీవరకు రిమాండ్‌ను పొడిగిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
వంశీ బెయిల్ పిటీషన్ డిస్మిస్
విజయవాడలీగల్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. కృష్ణా జిల్లా గన్నవరం గాంధీబొమ్మ సెంటర్‌లో తన స్థలం ఆక్రమించి, వేరేవారికి విక్రయించారని సీతామహాలక్ష్మి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదుమేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి బెయిల్ మంజూరుచేయాలని ఆయన తరఫు న్యాయవాదులు పిటీషన్ దాఖలుచేశారు. ఇరువర్గాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయస్థానం బుధవారం బెయిల్ పిటీషన్‌ను డిస్మిస్ చేస్తూ విజయవాడలోని 12వ అదనపు జ్యుడీషియల్ కోర్టు ఆదేశాలు జారీచేసింది.