
కాపర్ దొంగలు...కర్షకులకు సవాలు
జి.కొండూరు: కాపర్ దొంగలు రైతులకు తలపోటుగా మారారు. వ్యవసాయ బోర్లలో విద్యుత్ మోటార్లకు ఉండే కాపర్ కేబుళ్లను అందినకాడికి కోసి ఎత్తుకు పోతున్నారు. ఇవే ఘటనలు పదేపదే జరుగుతుండడంతో రైతులు తలలు బాదుకుంటున్నారు. కేబుళ్లకు అయ్యే ఖర్చు కన్నా మోటార్ల రిపేర్లకు అయ్యే ఖర్చు తమకు భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు స్పందించి కేబుళ్ల దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు. జి.కొండూరు మండల పరిధిలోని మునగపాడు, చెర్వుమాధవరం, సున్నంపాడు గ్రామాల్లో ఈ విధంగా తరచుగా విద్యుత్ కేబుళ్లను చోరీ చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి.
ఆ మూడు గ్రామాల్లో నిత్యం చోరీలే
జి.కొండూరు మండల పరిధిలోని 22 గ్రామ పంచాయతీల పరిధిలో 4 వేల వరకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లు ఉండగా చెర్వుమాధవరం, మునగపాడు, సున్నంపాడు గ్రామ పంచాయతీల పరిధిలో 450 వరకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లు ఉన్నాయి. అయితే ఈ మూడు గ్రామాల పరిధిలో గత ఏడాదిన్నర కాలంగా వ్యవసాయ బోర్లలో ఉన్న విద్యుత్ మోటార్లకు స్టార్టర్ బోర్డు నుంచి మోటార్లలోకి విద్యుత్‌ను సరఫరా చేసే కాపర్ విద్యుత్ కేబుళ్లను కోసి చోరీ చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వలన మోటార్లకు వందల అడుగులోతుకు వెళ్లిన కేబుళ్లు జారి బోర్లలో పడిపోతున్నాయి. ఈ క్రమంలో మోటార్లను పైకి తీసి కేబుళ్లను జాయింట్ చేసి మళ్లీ మోటార్లను అమర్చాల్సి వస్తుంది. ఈ పని చేయడానికి ఒక్కొక్క మోటారుకు రూ.3వేల వరకు ఖర్చు అవుతుంది. ఒక్కొక్క మోటారు వద్ద ఇప్పటికే మూడు నుంచి ఐదు సార్లు చోరీలు జరగడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. దొంగలు తాము చోరీ చేసిన కాపర్ విద్యుత్ కేబుళ్లను కరిగించి దాని నుంచి కాపర్‌ను వేరు చేసి కేజీ రూ.300 నుంచి 400 వరకు విక్రయిస్తారని తెలుస్తోంది. బయట మార్కెట్లో కాపర్ విలువ కేజీ రూ.800 నుంచి రూ.900 వరకు ఉన్న క్రమంలో చోరీ చేసిన కాపర్‌కి డిమాండ్ ఉండడంతో దొంగలు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిత్యం ఈ మూడు గ్రామాల్లోనే చోరీలు జరగడం పట్ల రైతులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ మూడు గ్రామాల్లోనే పాడి పశువులు, పందెం కోళ్లు సైతం చోరీలు జరగడంతో స్థానికంగా ఉండే వ్యక్తులే ఈ పని చేస్తున్నారనే ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యవసాయ మోటార్ల వద్ద విద్యుత్ కేబుళ్ల చోరీ అస్తమానం రిపేర్ల ఖర్చుతో రైతులకు ఆర్థిక భారం వరుస చోరీ ఘటనలతో బెంబేలు దొంగలపై పోలీసులు దృష్టి పెట్టాలంటున్న రైతులు