
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.అప్పారావు, పిల్లి నరసింహారావు డిమాండ్ చేశారు. విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో ఏపీ బిల్డింగ్, అదర్ వర్కర్స్ ఫెడరేషన్(సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా అప్పారావు, నరసింహారావు మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే తక్షణమే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ ప్రతి మీటింగ్‌లోనూ చెప్పారని గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తయినా హామీ అమలుకు నోచుకోలేదన్నారు. సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తే ఈ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు. సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అవసరమైన నిధులు కోసం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సెస్ చట్టం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర సంక్షేమ బోర్డులో రూ.4,298 కోట్లు ఉన్నాయని ఇటీవల రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శాసనమండలిలో ప్రకటించారని గుర్తు చేశారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలకు అమలు చేయడానికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించాల్సిన అవసరం లేదన్నారు. బోర్డు నుంచి తీసుకున్న సొమ్మును బోర్డుకు తిరిగి జమ చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని కూటమి నేతల హామీని నిలబెట్టుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ధర్నాలో సీఐటీయూ సెంట్రల్ సిటీ నాయకులు ఎం.బాబురావు, వై.సుబ్బారావు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సెంట్రల్ సిటీ కార్యదర్శి బి. గోవిందు, తూర్పు సిటీ కార్యదర్శి రాజు, అలీ, బాబు, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్