
దూది.. సూదికీ గతిలేదు
● మందులు, టెస్టులు అన్నీ బయటకే.. ● పేద రోగులకు తప్పని అవస్థలు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● రాష్ట్రంలోని ఏకై క టీచింగ్ ఆయుర్వేద ఆస్పత్రి దుస్థితి ఇదీ..
లబ్బీపేట(విజయవాడతూర్పు): సంప్రదాయ ఆయుర్వేద వైద్యంపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ఫలితంగా రాష్ట్రంలోనే ఏకై క ప్రభుత్వ టీచింగ్ ఆయుర్వేద ఆస్పత్రిగా ఉన్న విజయవాడ లోని డాక్టర్ ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేద ఆస్పత్రి అరకొర సౌకర్యాల కునారిల్లుతోంది. దుష్ఫలితాలు లేని వైద్యమని ఆశతో వస్తున్న రోగులకు నిరాశే ఎదురవుతోంది. మందులు, రక్త పరీక్షలతో పాటు, ఫైల్స్, ఫిస్టులా వంటి వ్యాధులతో వచ్చే వారు దూది, సూది కూడా బయట కొనుగోలు చేసి తీసుకురావాల్సిన దయనీయ స్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో కొనుగోలు చేసి మందుల్లో చాలా వరకు నిండుకున్నాయి. ఉన్న అర కొర మందులనే రోగులకు ఇచ్చి పంపుతున్నారు. లేనివి బయట కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు. డబ్బులు లేక ప్రభుత్వాస్పత్రికి వస్తే, ఇక్కడ మందులు కూడా లేవంటున్నారని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్కానింగ్‌లూ బయటకే..
చికిత్స కోసం వచ్చిన వారికి ఎవరికై నా ఆల్ట్రాసౌండ్, సీటీ, ఎంఆర్‌ఐ స్కానింగ్‌లు అవసరమైతే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వెళ్లి తీయించుకోవాలని ఆయుర్వేద ఆస్పత్రి వైద్యులు సూచించాలి. కానీ కొంత మంది వైద్యులె కమీషన్ల కోసం ప్రైవేటు స్కానింగ్ సెంటర్‌లకు రాస్తున్నారు. డాక్టర్లు రాసిచ్చిన చీటీ తీసుకుని ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు వెళ్తే రూ.వేలల్లో గుంజుతున్నారని పలువురు రోగులు ఆరోపించారు. అంతేకాదు ఒక మహిళ కీళ్ల నొప్పితో ఆస్పత్రికి వస్తే, పిల్లలు లేరని తెలుసుకుని, ప్రైవేటు ఐవీఎఫ్ సెంటర్‌కు వెళ్లాలని వైద్యుడు సిఫార్సు చేశాడండే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ నిర్లక్ష్యం, వైద్యుల అత్యాస వెరసి రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.
నిలిచిన పంచకర్మ
గతంలో ఆయుర్వేద ఆస్పత్రిలోని పంచకర్మ విభాగంలో అనేక రకాల చికిత్సలు అందించే వారు. ఊబకాయం, మైగ్రేన్, నడుం నొప్పి, మెడ నొప్పితో పాటు వివిధ రకాల చర్మ వ్యాధులకు చికిత్సలు చేసేవారు. ఇప్పుడు పంచకర్మ విభాగం దాదాపు మూలనపడింది. పంచకర్మ చికిత్సలు చేసేందుకు అవసరమైన తైలాలు అందుబాటులో ఉండటం లేదు. అంతేకాకుండా నాల్గో తరగతి సిబ్బంది సైతం కొరత ఉండటంతో చికిత్సలు నిలిచిపోయాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు నిరుత్సాహంగా తిరిగి వెళ్తున్నారు.
సగం మందులే ఇచ్చారు
నేను లారీ క్లీనర్‌గా పనిచేసే వాడిని. నాకు గతంలో వెన్నుపూస సర్జరీ జరిగింది. మళ్లీ నొప్పిగా ఉండటంతో చికిత్స కోసం ఆయుర్వేద ఆస్పత్రికి వస్తున్నాను. గతంలో రెండు సార్లు వచ్చాను. ఏవో మందులు ఇచ్చారు నొప్పి తగ్గ లేదు. ఆ విషయం చెప్పినా మళ్లీ అవే మందులు రాశారు, వాటిలో సగమే ఇచ్చారు. మిగిలిన సగం మందులను బయటే కొనుక్కోవాలని సూచించారు.
– భూపతి రత్తయ్య, అవనిగడ్డ
సౌకర్యాలు కల్పించాలి
ప్రజలకు విద్య, వైద్యం అవసరం. ప్రభుత్వాలు ఆ రెండు రంగాలను విస్మరించకూడదు. సంప్రదాయ ఆయుర్వేదంపై నిర్లక్ష్యం తగదు. ఇక్కడ మంచి వైద్యం అందుతుందని దూర ప్రాంతాల నుంచి రోగులు వస్తున్నారు. అయితే మందులు సరిగా ఇవ్వకుండా బయట కొనుక్కోమనడం, దూది కూడా లేక పోవడం దురదుష్టకరం. ప్రభుత్వం స్పందించి, సౌకర్యాలు కల్పించాలి.
– మునీర్ అహ్మద్ షేక్, లబ్బీపేట

దూది.. సూదికీ గతిలేదు

దూది.. సూదికీ గతిలేదు

దూది.. సూదికీ గతిలేదు

దూది.. సూదికీ గతిలేదు