
రాజధాని అభివృద్ధికి భూముల పరిశీలన
ఇబ్రహీంపట్నం: అమరావతి రాజధాని అభివృద్ధికి మండలంలోని జూపూడి, చినలంక, పెదలంక గ్రామాల్లోని లంక భూములను రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యేలు వసంత వెంకట కృష్ణప్రసాద్, బొండా ఉమామహేశ్వరరావు, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈ ప్రాంతంలో భూములు సేకరించి స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా మెరక ప్రాంత భూములు 2 వేల ఎకరాలు సేకరించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. త్వరగా అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇందుకు అవసరమైన హైలెవల్ కమిటీ వేసి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అమరావతి స్పోర్ట్స్ సిటీలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, క్రీడా విశ్వవిద్యాలయం నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. అథ్లెట్లు, ఫిజియోథెరఫిస్టులు, కోచ్‌లకు కూడా ఇక్కడే శిక్షణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపడతామని తెలిపారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.