
అకాల వర్షం.. అపార నష్టం
పెనుగంచిప్రోలు: పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం, ఈదురు గాలులు రైతులను తీవ్రంగా నష్టపరిచింది. మంగళవారం రాత్రి వచ్చిన గాలులకు మొక్కజొన్న నేలవాలగా, మామిడికాయలు రాలిపోయాయి. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, మిర్చి అక్కడక్కడా తడిసింది. కోత కోసి అమ్మేదశలో మొక్కజొన్న, అసలే అంతంత మాత్రం కాపుకొచ్చిన మామిడి ఈదురు గాలులకు వర్షార్పణం అయాయ్యని రైతులు ఆవేదన చెందుతున్నారు. అసలే మద్దతు ధర లేక ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న తరుణంలో మిర్చి, ధాన్యం కల్లాల్లో ఆరబోసి పట్టాలు కప్పినా గాలులకు పట్టాలు కొట్టుకు పోయి అక్కడకడ్కడా తడవటంతో కొనే నాథుడు ఉండటని లేదని అంటున్నారు. ఈ ఏడాది రబీ సాగు చేస్తున్న రైతులతో పాటు, మామిడి, మొక్కజొన్న మీద ఆశలు పెట్టుకున్న రైతులందరికీ చేదు అనుభవమే ఎదురయింది. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు పట్టాలు కూడా ప్రభుత్వం అందించలేకపోతుందని వాపోతున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సాయం అందించాలని కోరుతున్నారు.
వత్సవాయి: మంగళవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులు బెంబేలెత్తిపోయారు. కల్లాల్లో ఉన్న మిర్చి, మొక్కజొన్న పంటలపై పట్టాలను కప్పుకున్నారు. రాత్రి సమయంలో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన పెద్ద వర్షం ప్రారంభమైంది. సుమారు గంటపాటు వర్షం పడింది. ఈదురుగాలులు బాగా రావడంతో కొన్నిచోట్ల పంటపై కప్పిన పట్టాలు కూడా లేవడంతో పంట తడిచిపోయింది. అసలే మిర్చి పంటకు సరైన ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే మూలిగేనక్కపై తాటికాయ పడ్డట్లు రైతుల పరిస్థితి ఉందని వాపోతున్నారు.
జగ్గయ్యపేట: ఈదురుగాలులతో కూడిన వర్షంతో కల్లాల్లోని ధాన్యం రాశులు తడిసిపోయాయి. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా కష్టాలు పడ్డారు. పట్టణంలోని మార్కెట్ యార్డులోని ధాన్యం, ఆటోనగర్ కల్లాల్లోని మొక్కజొన్న, గౌరవరం, షేర్‌మహ్మద్‌పేట గ్రామాల్లోని కల్లాల్లోని ధాన్యం పూర్తిగా తడిసింది. కొన్ని కల్లాల్లో ధాన్యం తడిసి మొలకెత్తినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయాధికారి విజయకుమారి బుధవారం పరిశీలించారు.
తీవ్రంగా దెబ్బతిన్న పంటలు ఆందోళనలో రైతులు ఆదుకోవాలని వినతి
రైతులను పట్టించుకోవాలి
ఈదురు గాలులు, వర్షానికి మొక్కజొన్న నేల వాలింది. కోతకు వచ్చిన సమయంలో నేల వాలటంలో కంకుల్లోకి నీరు పోయి కుళ్లి పోతాయి. రైతులకు అవసరమైన పట్టాలు అందిస్తే కొంతవరకు పంటను కాపాడుకునే వీలుంటుంది. రైతుల పరిస్థితిని గుర్తించి ప్రభుత్వం పట్టించుకోవాలి.
–దురిశాల రంగయ్య, రైతు, పెనుగంచిప్రోలు
పట్టాలపై నీరు చేరింది
ఐదు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. వర్షానికి ఆరబోసిన మొక్కజొన్నపై పరదా పట్టాలు కప్పాను. అయినా అక్కడక్కడ కొంత తడిసింది. కచ్చితంగా పంట అమ్మే సమయంలో వర్షాలు, గాలులు రైతులను వేదనకు గురి చేస్తున్నాయి.
–యల్లేశ్వరరావు,
రైతు, పెనుగంచిప్రోలు

అకాల వర్షం.. అపార నష్టం

అకాల వర్షం.. అపార నష్టం

అకాల వర్షం.. అపార నష్టం