
స్పందించని సహృదయం
లబ్బీపేట(విజయవాడతూర్పు): పేద రోగులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ హృదయం స్పందించడంలేదు. ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)లో అత్యాధునిక సౌకర్యాలు, వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నా అత్యవసర సమయంలో రోగులు తమ గుండెలను అరచేతిలో గుంటూరుకు వెళ్లాల్సిన పరి స్థితి దాపురించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యం పొందలేక, ప్రభుత్వాస్పత్రికి వస్తే గుంటూరు వెళ్లండని వైద్యులు ఉచిత సలహా ఇస్తుండటంతో చేసేదేమీ లేక రోగులు తమ పేదరికాన్ని నిందించుకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది.
గుండె శస్త్ర చికిత్స విభాగానికి గ్రహణం
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని గుండె శస్త్ర చికిత్స విభాగానికి గ్రహణం పట్టింది. ఆ విభాగంలో ఆధునిక సౌకర్యాలు ఉన్నా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఆ విభాగంలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, పోస్ట్ ఆఫ్ ఇంటెన్సివ్ కేర్ వార్డును ఏర్పాటు చేసి ముగ్గురు వైద్యులను నియమించారు. ప్రస్తుతం గుండె ఆపరేషన్లు జరగడం లేదు. గుండె ఆపరేషన్‌లు అవసరమైన రోగులను గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లండంటూ వైద్యులు ఉచిత సలహా ఇస్తున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఐదో అంతస్తులో కార్డియో థోరాసిక్ శస్త్ర చికిత్స (గుండె ఆపరేషన్) విభాగం ఉంది. అక్కడ ఆధునిక ఆపరేషన్ థియేటర్‌తో పాటు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కూడా ఉంది. ఈ విభాగాన్ని కోవిడ్‌కు ముందు ఏర్పాటు చేశారు. కోవిడ్ నేపథ్యంలో ఎక్కువ రోజులు మూత పడి ఉండటంతో మరలా 2023లో రూ.20 లక్షలతో థియేటర్‌ను ఆధునికీకరించారు. లామినర్ ఫ్లోరింగ్, రోగులకు ఇన్‌ఫెక్షన్లు రాకుండా మాడ్యులర్లను ఏర్పాటు చేశారు. శస్త్ర చికిత్స అనంతరం రోగులను ఉంచేందుకు ఆధునిక సౌకర్యాలతో పోస్ట్ ఆఫ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ శస్త్ర చికిత్సలు మాత్రం జరగడం లేదు.
అందుబాటులో ముగ్గురు వైద్యులు
కార్డియో థోరాసిక్ శస్త్ర చికిత్స విభాగంలో ప్రస్తుతం ముగ్గురు వైద్యులు ఉన్నారు. వారంలో మూడు రోజులు (సోమ, బుధ, గురు) అవుట్‌పేషెంట్లు వారు సేవలు అందిస్తున్నారు. గుండె సర్జరీలు మాత్రం చేయడం లేదు. చేతి రక్తనాళాలు, కాళ్ల రక్తనాళాల్లో పూడికలు వంటి వాటికి మాత్రమే సర్జరీలు చేస్తున్నారు. ఇక్కడ గుండె ఆపరేషన్‌లు చేసేందుకు అవసరమైన సిబ్బందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సి ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూపడం లేదు. దీంతో గుండె సర్జరీ తర్వాత రోగులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై ప్రస్తుతం జీజీహెచ్ సిబ్బందికి సరైన అవగాహన లేక పోవడంతోనే సర్జరీలు చేసేందుకు వైద్యులు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ప్రభుత్వం చొరవ చూపి గుండె సర్జరీలు చేసేలా చూడాలని రోగులు వేడుకొంటున్నారు.
గుంటూరు రిఫర్ చేస్తున్నారు
ప్రస్తుతం కార్డియాలజీ విభాగంలో క్యాథ్‌ల్యాబ్ పీపీపీ మోడ్‌లో నిర్వహిస్తున్నారు. అక్కడ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత స్టెంట్ అవసరమైతే అక్కడే వేస్తున్నారు. బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తే మాత్రం గుంటూరుకు రిఫర్ చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ ఉన్న రోగులు అయితే విజయవాడలోని ఏదో ఒక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తున్నారు. ఇక్కడికి ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు జిల్లాలకు చెందిన రోగులు వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి ఇక్కడి వచ్చిన వారు, మరలా గుంటూరు వెళ్లా లంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు.
బెజవాడ జీజీహెచ్‌లో హృద్రోగులకు అందని మెరుగైన వైద్యం ఆధునిక సౌకర్యాలున్నా గుండె వైద్య విభాగం అలంకార ప్రాయం బైపాస్ ఆపరేషన్లకు గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతోపేదలకు గుండె ఆపరేషన్లు దూరం
గుంటూరు వెళ్లమన్నారు
ఇటీవల నాకు తెలిసిన వ్యక్తికి ఛాతీలో నొప్పి వస్తే ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. అక్కడ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. ఇక్కడ సర్జరీలు చేయడం లేదని, గుంటూరు వెళ్లాలని వైద్యులు చెప్పడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వాళ్లతో మాట్లాడి చేయించాల్సి వచ్చింది. ఇలా ఎంతో మంది గుండె సర్జరీల కోసం ఇబ్బంది పడుతున్నారు.
– సయ్యద్ అలీం,
కో ఆప్షన్ సభ్యుడు, వీఎంసీ
గతంలోనే సౌకర్యాల కల్పన
గత ప్రభుత్వ హయాంలోనే విజయవాడ జీజీహెచ్‌లో గుండె శస్త్ర చికిత్సలు చేసేందుకు సౌకర్యాలు కల్పించాం. ఆపరేషన్ థియేటర్‌ను రూ.20 లక్షలతో ఆధునికీకరించాం. ముగ్గురు వైద్యులను నియమించాం. ఇంతలో ఎన్నికలు రావడంతో సేవలను ప్రారంభించలేకపోయాం. ప్రస్తుత ప్రభుత్వం వైద్య రంగాన్ని విస్మరించింది. గుంటూరులో గుండె సర్జరీలు చేస్తుంటే విజయవాడలో చేయక పోవడం బాధాకరం.
– యర్రంశెట్టి అంజిబాబు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ సభ్యుడు

స్పందించని సహృదయం

స్పందించని సహృదయం

స్పందించని సహృదయం