దోపిడీ! | - | Sakshi
Sakshi News home page

దోపిడీ!

Published Mon, Apr 28 2025 1:13 AM | Last Updated on Mon, Apr 28 2025 1:13 AM

దోపిడ

దోపిడీ!

‘బడి’ తెగించి

కంకిపాడు: కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పలు ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రభుత్వ అండదండలతో పరిధి దాటి వ్యవహరిస్తున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి వ్యాపారం సాగిస్తున్నాయి. పాఠశాలలనే వ్యాపార సముదాయంగా మార్చేస్తున్నాయి. నోటు పుస్తకాలు, మెటీరియల్స్‌ విక్రయించి తమ గల్లా పెట్టెలు నింపుకుంటున్నాయి. ప్రజల జేబులు లూటీ అవుతున్నా.. విద్యాశాఖ కనీసం ఆ వైపు కన్నెత్తి చూడకపోవటం విస్మయం కలిగిస్తోంది.

జిల్లాలో పరిస్థితి..

కృష్ణా జిల్లా వ్యాప్తంగా 316 ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో 169 వరకూ హైస్కూల్స్‌ ఉన్నాయి. ఏటా లక్షకు పైగా విద్యార్థులు ఆయా విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు మంజూరయ్యాయి. అయినా ఆయా సంస్థలు అడ్మిషన్ల వేటలో పోటీ పడుతూ పది ఫలితాల సాధన వివరాల పేరుతో తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు.

అడ్డగోలు వ్యాపారం..

అడ్మిషన్ల ప్రారంభంతోనే విద్య వ్యాపారానికి కొన్ని విద్యాసంస్థలు తలుపులు బార్లా తెరిచాయి. మెటీరియల్స్‌, నోటు పుస్తకాలు తమ పాఠశాలలోనే కొనుగోలు చేయాలని నిబంధన విధిస్తున్నాయి. అంతే కాకుండా తరగతుల వారీగా రేట్లు నిర్ణయించి అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నాయి. నిబంధనల మేరకు ఏ విద్యాసంస్థలోనూ నోటు పుస్తకాలు, మెటీరియల్స్‌ విక్రయం జరగకూడదు. కానీ పలు యాజమాన్యాలు నిబంధనలు తుంగలో తొక్కి అడ్డగోలు వ్యాపారానికి తెరతీస్తున్నాయి. గత విద్యాసంవత్సరంలో మెటీరియల్స్‌, నోటుపుస్తకాలు పదో తరగతి విద్యార్థులకు రూ. 7,800 ధర నిర్ణయిస్తే ఈ ఏడాది 4, 5 తరగతుల చిన్నారులకే రూ. 8 వేలు వరకూ ధర నిర్ణయించారంటే విద్యాసంస్థల దోపిడీ ఏ తీరుగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అదే సెమీ కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో అయితే ఈ దోపిడీ పరాకాష్టకు చేరింది. వాళ్లు చెప్పిందే వేదంగా మారింది. ఆయా విద్యాసంస్థల్లో అడ్డగోలు రేట్లు నిర్ణయించి మెటీరియల్స్‌, నోటు పుస్తకాలు అమ్మేస్తున్నారు.

ఫీజుల్లోనూ అదే స్పీడు..

గత జూన్‌ నుంచి ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల విషయంలో దూకుడు పెంచాయి. సెమీ స్కూల్స్‌లో వార్షిక ఫీజు రూ. 10వేలు నుంచి రూ. 20వేలు వరకూ పెంచేశాయి. కార్పొరేట్‌ తరహా సంస్థలు రూ. 50వేలు ఫీజు అదనంగా వసూళ్లు చేశాయి. ఈ ఏడాది కూడా ఫీజులు ఇష్టానుసారంగా వసూలు చేసేందుకు కొన్ని సంస్థలు రెడీ అయిపోయాయి. తమ సంస్థకు వచ్చిన పది ఫలితాలను ఆశచూపుతూ అడ్మిషన్లను పెంచుకుంటున్నాయి. మార్కుల వలలో పడి తల్లిదండ్రులు కష్టమైనా, భారమైనా ప్రైవేటు పాఠశాలల వైపు అడుగులు వేస్తున్నారు. దీంతో విద్యాసంస్థల ఆర్థిక దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది.

నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల విక్రయాలు అడ్డగోలుగా ప్రజల సొమ్ము లూటీ కూటమి వత్తాసుతో పెట్రేగిపోయి దందా ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలను చూసీ చూడనట్లుగా విద్యాశాఖ

మా దృష్టిలో లేదు..

ప్రైవేటు విద్యాసంస్థల్లో పుస్తకాల విక్రయాలకు సంబంధించి మాకు ఎలాంటి సమాచారం లేదు. ఎంఈవోలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. కానీ ఎలాంటి నివేదిక అందించలేదు. పుస్తకాల విక్రయాలకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే షోకాజ్‌ నోటీసులు ఇవ్వటంతో పాటుగా అవసరమైతే విద్యాసంస్థ గుర్తింపును కూడా రద్దు చేస్తాం.

– పీవీజే రామారావు, జిల్లా విద్యాశాఖాధికారి, కృష్ణాజిల్లా

ఇష్టారాజ్యంగా ప్రైవేటు విద్యాసంస్థల ఫీ‘జులుం’

కన్నెత్తి చూడని విద్యాశాఖ..

ప్రైవేటు విద్యాసంస్థల్లో అడ్డగోలుగా పుస్తకాలు విక్రయాలు జరిగిపోతున్నాయి. అయినా విద్యాశాఖ అధికారులు ఏ ఒక్కరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం తనిఖీలు కూడా చేపట్టడం లేదు. ఫలితంగా విద్య మాటున అడ్డగోలు వ్యాపారం సాగిస్తూ లక్షలు పోగేసుకుంటున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

దోపిడీ! 1
1/1

దోపిడీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement