
ఈ–వ్యర్థాలతో పర్యావరణానికి ముప్పు
పటమట(విజయవాడతూర్పు): ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ– వేస్ట్) వల్ల తీవ్ర అనర్థాలు పొంచి ఉన్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఈ–వ్యర్థాల సేకరణను ఉద్యమంగా చేపట్టి, వాటిని రీసైక్లింగ్ చేయడం ద్వారా విలువైన లోహాల వృథాలను అరికట్టడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో భాగస్వాములు కావాలని కోరారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వీఎంసీ ఆధ్వర్యంలో శనివారం బెంజిసర్కిల్ సమీపంలోని నారా చంద్రబాబు కాలనీలో ఈ–వ్యర్థాల ప్రత్యేక నిర్వహణ (స్పెషల్ డ్రైవ్) కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ నెలలో ఈ–వ్యర్థాల సేకరణ ప్రత్యేక డ్రైవ్‌గా చేపట్టినట్లు తెలిపారు. నగరంలో నిత్యం 700 కిలోల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఉండే లెడ్, కాడ్మియం, మెర్క్యురీ, బెరీలియం వంటి మూలకాలు అతి ప్రమాదకరమైనవని, వాటిని బహిరంగ ప్రదేశాల్లో పడేస్తే భూమి, నీరు, గాలి కలుషితం అవుతాయని, ఫలితంగా ప్రజలు రోగాలబారిన పడతారని వివరించారు. అనంతరం స్థానికుల నుంచి ఈ–వ్యర్థాలను సేకరించారు. వీఎంసీ అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్, పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ జోనల్ కమిషనర్ కె.షమ్మీ, ఇన్‌చార్జి చీఫ్ మెడికల్ ఆఫీసర్ గోపాలకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.