
బడుగుల చదువుకు భరోసా
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో విద్యా సంస్కరణలు అమలు చేసిన ఘనత నాటి సీఎం వైఎస్ జగన్‌మోహనరెడ్డిది. ఆయన పాలన పేద విద్యార్థులకు సువర్ణాక్షరం. ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్ సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దడమే కాకుండా ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ పేదలకు అవకాశం కల్పించడానికి ఆలోచన చేశారు. ఆయన ప్రవేశపెట్టిన విద్యాహక్కు చట్టం ద్వారా ప్రతి ప్రైవేట్ విద్యాసంస్థ మొదటి తరగతిలో 25 శాతం సీట్లు పేదలకు కేటాయించేలా నిర్ణయించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనలో 2022–23 నుంచి ఈ పథకాన్ని అమలు చేశారు. అదే క్రమంలో ఎన్టీఆర్ జిల్లాలోనూ ఈ పథకాన్ని అమలు చేయడంతో వేలాది మంది పేద కుటుంబాలు లబ్ధి పొందాయి.
అధిక శాతం విద్యార్థులకు అందుబాటులో..
విద్యాహక్కు చట్టం సెక్షన్ 12 (1) సీ ద్వారా గడిచిన మూడేళ్లలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 4,056 మంది విద్యార్థులను మొదటి తరగతికి విద్యాశాఖ ఎంపిక చేసింది. వారిని వారి సమీప ప్రాంతాల్లోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుకునే వీలు కల్పించింది. తొలి ఏడాది 2022–2023 విద్యాసంవత్సరంలో 120 మందికి, 2023–2024లో 1,127 మందికి అవకాశం కల్పించింది. 2024–2025 విద్యాసంవత్సరంలో మొదటి ఫేజ్‌లో 990, రెండో ఫేజ్‌లో 397, నాలుగో ఫేజ్‌లో 1422 మందిని ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరిలో అధిక శాతం విద్యార్థులు ఆయా విద్యాసంస్థల్లో కొనసాగుతున్నారు.
2025–26 సంవత్సరానికి నోటిఫికేషన్
ఈ విద్యాహక్కు చట్టం –2009 సెక్షన్ 12 (1)సీ అమలులో భాగంగా 2025–2026 విద్యా సంవత్సరానికి ఐబీ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, స్టేట్ సిలబస్ చదువుతున్న పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 28 నుంచి మే 15వ తేదీ వరకూ వివిధ వర్గాల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. విద్యార్థులు ఆధార్ ద్వారా ప్రాథమిక వివరాలతో http://cse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు
అర్హతలు ఇవి
ఐబీ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పాఠశాల్లో ప్రవేశం కోసం 31.03.2025 నాటికి ఐదేళ్ల వయసు నిండి ఉండాలి. స్టేట్ సిలబస్ పాఠశాలల్లో ప్రవేశానికి 01.06.2025 నాటికి ఐదేళ్ల వయసు నిండాలి. విద్యా హక్కు చట్టం–2009, సెక్షన్ 12(1) ఇ ప్రకారం, ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో బలహీన, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పిల్లలకు వారి నివాసానికి ఒక కిలోమీటర్ లేని పక్షంలో రెండు కిలోమీటర్లు తర్వాత మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న అన్ని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లను కేటాయించింది.
ఎంపిక విధానం
ఒకటో తరగతి ప్రవేశాలకు పోర్టల్‌లో నమోదు కోసం ఈ నెల 28 నుంచి మే 15 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చిన దరఖాస్తుల్లో విద్యార్థుల అర్హతలను మే 16 నుంచి 20వ తేదీ వరకూ నిర్ధారణ ప్రక్రియను చేపడతారు. లాటరీ ద్వారా మొదటి విడత ఫలితాలను మే 21 నుంచి 24 మధ్య విడుదల చేస్తారు. సీట్లు పొందిన విద్యార్థుల ప్రవేశాల నిర్ధారణ జూన్ 2వ తేదీ చేస్తారు. రెండో విడత లాటరీ ఫలితాలను జూన్ 6వ తేదీ విడుదల చేస్తారు.
అడ్డుకునేందుకు కార్పొరేట్ సంస్థల యత్నం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన నిర్ణయాన్ని అడ్డుకునేందుకు ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. వివిధ రూపాల్లో నాటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు అండగా నిలవాల్సిందేనని సూచించారు. దాంతో కార్పొరేట్ సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. న్యాయస్థానం విద్యాహక్కు చట్టం అమలు చేయాల్సిందేనని తీర్పు ఇవ్వడంతో పాటు కొన్ని సూచనలు చేసింది. దాంతో ఏటా పేద వర్గాలకు కార్పొరేట్ సంస్థల్లో 25 శాతం సీట్లు ఉచితంగా దక్కుతున్నాయి.
ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు
చట్టం కింద 25 శాతం ఉచిత సీట్లు
పథకాన్ని ప్రవేశపెట్టిన జగన్‌మోహన్‌రెడ్డి
ఎన్టీఆర్ జిల్లాలో గత మూడేళ్లలో 4,056 మందికి అవకాశం
2025–26 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ ఇచ్చిన సమగ్ర శిక్షాభియాన్
అడ్డుకోవాలని చూసినా ముందుకే..
పేదలకు అన్ని విధాలుగా భరోసా ఇచ్చిన నేత జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన నిరంతరం పేద కుటుంబాలు చదువు కోవాలి.. తద్వారా వారి కుటుంబాలు అభి వృద్ధి చెందాలని భావించారు. అందులో భాగంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ క్రమంలోనే విద్యాహక్కు చట్టం ద్వారా 25 శాతం సీట్లు పేదలకు కేటాయించే దిశగా చర్యలు చేపట్టారు. ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని చూసినా ఆయన ముందుకు సాగారు.
–వానపల్లి రవీంద్ర,
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగ నేత

బడుగుల చదువుకు భరోసా