
మహిళా పోలీసుల ఆరోగ్య రక్షణకు వైద్యశిబిరాలు
పెనమలూరు: మహిళా పోలీసుల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు అన్నారు. కానూరు టాప్‌స్టార్ ఆస్పత్రిలో సోమవారం క్యాన్సర్‌పై అవగాహన, మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. మహిళా పోలీసులు పని ఒత్తిడిలో ఉండి ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుందన్నారు. మహిళా పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే విధుల నిర్వహణ సక్రమంగా జరుగుతుందని, వారి కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకోని క్యాన్సర్‌పై అవగాహన, ఉచిత వైద్య పరీక్షల శిబిరం ఏర్పాటు చేశామన్నారు. క్యాన్సర్ వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే సులభంగా జయించవచ్చన్నారు. ఎన్టీఆర్ జిల్లా సురక్ష ఫౌండేషన్ కన్వీనర్ కేవీ నరసమయ్య మాట్లాడుతూ.. మహిళా పోలీసులతో పాటు ఇతర సిబ్బంది ఆరోగ్య భద్రతకు మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ.. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను తాను డొనేట్ చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీపీ సరిత, టాప్‌స్టార్ ఎండీ తాతినేని శ్రీనివాస్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

మహిళా పోలీసుల ఆరోగ్య రక్షణకు వైద్యశిబిరాలు