
పెద్దాస్పత్రిపై పగ
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య రంగంపై కూటమి ప్రభుత్వ వివక్ష కొనసాగుతోంది. వైద్య కళాశాలలు, ప్రభుత్వాస్పత్రిలో అదనపు భవనాల నిర్మాణాలకు గ్రహణం పట్టింది. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తి చేసుకున్న భవనాలకు పదినెలలుగా అతీగతీ లేకుండా పోయింది. దీంతో అవి ఎప్పటికి పూర్తవుతాయో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. రోగులకు నాణ్యమైన సేవలు అందించే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అదనపు భవన నిర్మాణాలు చేపట్టగా, ప్రస్తుత ప్రభుత్వం మోకాలడ్డటంతో నిలిచిపోయాయి.
నిలిచిన క్యాజువాలిటీ నిర్మాణం..
ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా అత్యాధునిక క్యాజువాలిటీ బ్లాక్ నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒక్కో బ్లాక్ 2వేల చదరపు మీటర్ల విస్తీర్ణంతో నాలుగు అంతస్తుల్లో నిర్మించేందుకు రెండేళ్ల కిందట పనులు ప్రారంభించింది. అందులో అత్యవసర చికిత్స విభాగంతో పాటు, ట్రామాకేర్, ఏఎంసీ, అత్యవసర నిర్ధారణ పరీక్షలకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది అందుబాటులోకి వస్తే అత్యవసర వైద్యం అవసరమైన వారికి సత్వరమే సేవలు అందుతాయని అంతా భావించారు. ఇప్పటికే 50శాతం పైగా నిర్మాణం పూర్తికాగా.. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పది నెలలుగా పనులు నిలిచిపోయాయి. పేద రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు చేపట్టిన నిర్మాణం నిలిపి వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైద్య కళాశాల భవనాలపైనా..
ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలకు 2023–24 విద్యా సంవత్సరంలో పోస్టు గ్రాడ్యుయేషన్ సీట్లు వంద వరకూ పెరిగాయి. పెరిగిన సీట్లకు అనుగుణంగా కేంద్రం నుంచి నిధులు సైతం మంజూరయ్యాయి. ఆ నిధులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కింద మరిన్ని నిధులు కేటాయించి దాదాపు రూ.90 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టారు. అదనపు తరగతి గదులతో పాటు, లెక్చర్ హాల్స్, లేబొరేటరీ వంటి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. 2024 జూన్ నాటికే 50 శాతం పైగా పనులు పూర్తి కాగా ప్రస్తుతం నత్త నడకన నడుస్తున్నాయి. అవి పూర్తి అయితే కాని విద్యార్థులకు సదుపాయాలకు అందుబాటులోకి వస్తాయి.
విజయవాడ ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో నిలిచిపోయిన నిర్మాణ పనులు
ఆస్పత్రిలో ఆగిన అభివృద్ధి పది నెలలుగా ముందుకు సాగని నిర్మాణాలు నిలిచిన కొత్త క్యాజువాలిటీ భవనం పనులు నత్త నడకన సాగుతున్న వైద్య కళాశాలలో అదనపు గదుల నిర్మాణం
వైద్య రంగంపై వివక్ష తగదు..
కూటమి ప్రభుత్వం వైద్య రంగంపై వివక్ష చూపడం తగదు. విజయవాడ ఆస్పత్రి, వైద్య కళాశాలలో నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలి. రోగులు, వైద్య విద్యార్థుల అవసరాల కోసం చేపట్టిన నిర్మాణాలు పూర్తి చేసి, భవనాలు అందుబాటులోకి తీసుకు రావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
– డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు,
వైఎస్సార్ సీపీ వైద్య విభాగం

పెద్దాస్పత్రిపై పగ

పెద్దాస్పత్రిపై పగ