
రైలులో మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ):ౖరెలులో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) అరెస్టు చేసి 67 మద్యం ఫుల్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ జీఆర్‌పీ సీఐ జె.వి రమణ తెలిపిన వివరాల ప్రకారం... సిబ్బందితో కలసి విజయవాడ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 1వ నెంబర్ ప్లాట్‌ఫాం వెయిటింగ్ హాల్ వద్ద తనిఖీలు చేస్తున్న సమయంలో నరసరావుపేటకు చెందిన వరికంట వీరాస్వామి అనుమానాస్పదంగా కనిపించగా అదుపులోకి తీసుకొని తనిఖీ చేశామని చెప్పారు. ఆ వ్యక్తి వద్ద ఉన్న మూడు లగేజీ బ్యాగులను సోదా చేయగా అందులో హర్యానా రాష్ట్రానికి చెందిన 67 మద్యం ఫుల్ బాటిళ్లు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. వీటిని హర్యానా నుంచి నరసరావుపేటకు రైలులో తరలిస్తున్నట్లు తెలపడంతో నిందితుడిని అరెస్టు చేశామన్నారు.