వివరాలు వెల్లడిస్తున్న సీఐ ఆదాం
లావేరు : ఇటీవల బుడుమూరు వద్ద జాతీయ రహదారిపై అనుమానాస్పద స్థితిలో లభ్యమైన యువకుడి మృతదేహానికి సంబంధించిన మిస్టరీ వీడింది. చార్జీ ఇవ్వలేదని బస్సులో నుంచి ప్రయాణికుడిని డ్రైవర్, క్లీనర్‌లు తోసేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు బాధ్యులైన ప్రైవేటు బస్సు డ్రైవర్ వెలమశెట్టి రామకృష్ణ, క్లీనర్ బొమ్మాళి అప్పన్నలను ఆదివారం జేఆర్‌పురం సీఐ ఎస్.ఆదాం అరెస్టు చేశారు. అనంతరం లావేరు పోలీస్ స్టేషన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా మధురవాడకు చెందిన గేదేల భరత్‌కుమార్ ఈ నెల 2న రాత్రి తన స్నేహితులు వెంకటేష్, శివతో కలిసి శ్రీకాకుళం వచ్చాడు.
3వ తేదీ వేకువజామున 3.30 గంటల సమయంలో తాను మధురవాడ వెళ్లిపోతానని బస్సు ఎక్కించాలని స్నేహితులకు చెప్పడంతో వారు శ్రీకాకుళంలోని నవభారత్ జంక్షన్ వద్దకు తీసుకువచ్చి భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వెళుతున్న గంగోత్రి అనే ప్రైవేటు బస్సును ఎక్కించారు. ఆ సమయంలో స్నేహితులు బస్సు చార్జీ ఫోన్‌పే చేస్తామని క్లీనర్‌కు చెప్పారు. బస్సు ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వచ్చినా ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపించకపోవడంతో క్లీనర్ భరత్‌కుమార్‌ను చార్జీ డబ్బులు ఇవ్వమని అడిగాడు. ఈ విషయమై ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. లావేరు మండలం బుడుమూరు వద్దకు వచ్చేసరికి డ్రైవర్ వెలమశెట్టి రామకృష్ణకు విషయం చెప్పగా బస్సు నుంచి తోసేయమని చెప్పాడు.
దీంతో బస్సు వెళుతుండగానే భరత్‌కుమార్‌ను క్లీనర్ బస్సు నుంచి బయటకు తోసేయడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. తొలుత పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు మృతిపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆ దిశలో దర్యాప్తు చేయగా ఈ విషయం బయటపడింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా గంగోత్రి బస్సుగా గుర్తించి ఆ రోజు డ్యూటీలో ఉన్నడ్రైవర్ రామకృష్ణ, క్లీనర్ అప్పన్నలను అదుపులోకి తీసుకొని విచారించారు. చార్జీ డబ్బుల కోసం జరిగిన గొడవలో భరత్‌కుమార్‌ను బస్సులోని నుంచి బయటకు తోసేశామని డ్రైవర్, క్లీనర్ నేరం అంగీరించారని సీఐ అన్నారు. సమావేశంలో లావేరు స్టేషన్ ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు, హెచ్‌సీ రామారావు, పీసీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment