
పెళ్లి పీటలెక్కిన ప్రేమ జంట
పెళ్లి మంత్రాలు ఇద్దరూ వినలేరు. కానీ మౌనాన్నే మంత్రంగా చేసుకున్నారు.
నరసన్నపేట: పెళ్లి మంత్రాలు ఇద్దరూ వినలేరు. కానీ మౌనాన్నే మంత్రంగా చేసుకున్నారు. ఒకరి పేరు ఒకరికి చెప్పుకోలేరు. కానీ ఒకరి మనసును ఒకరు గెలుచుకున్నారు. నరసన్నపేట నాయుడు వీధికి చెందిన కిరణ్, విశాఖపట్నం తాటిచెట్లపాలెంకు చెందిన అద్దంకి అలేఖ్యలు బధిరులు. ఇద్దరూ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు.
ప్రేమలో పడిన ఈ జంట స్నేహితుల సాయంతో నరసన్నపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఒక్కటైంది. స్నేహితులే పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. వరుడి తరఫున బంధువులు రాగా వధువు తరఫున స్నేహితులే బంధువులయ్యారు.