తెరుచుకోనున్న రత్న భాండాగార్‌..? | - | Sakshi
Sakshi News home page

తెరుచుకోనున్న రత్న భాండాగార్‌..?

Published Sat, Sep 30 2023 6:16 AM | Last Updated on Sat, Sep 30 2023 8:23 AM

- - Sakshi

భువనేశ్వర్‌: శ్రీజగన్నాథ ఆలయ రత్న భాండాగార్‌ సమస్యపై ఉన్నత స్థాయి ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని ఒడిశా హైకోర్టు శుక్రవారం ఆలయ నిర్వహణ కమిటీని ఆదేశించింది. కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుభాసిస్‌ తలపాత్ర, జస్టిస్‌ సావిత్రి రాథోలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ రెండు నెలల సమయం ఇచ్చింది. ఆలయ నిర్వహణ కమిటీ తరపున సీనియర్‌ న్యాయవాది బుద్ధదేవ్‌ రౌత్రాయ్‌, పిటిషనర్‌, బీజేపీ నాయకుడు సమీర్‌ మొహంతి తరపున సీనియర్‌ న్యాయవాది పీతాంబర్‌ ఆచార్య దాఖలు చేసిన వాదనలను విన్న తర్వాత ధర్మాసనం సెప్టెంబర్‌ 27న తీర్పును రిజర్వ్‌ చేసింది. దీనిలో భాగంగా శుక్రవారం తీర్పు వెల్లడించింది. దీంతో రత్న భాండాగార్‌ తెరుచుకోవడానికి అవకాశాలు ఉన్నాయని సర్వత్రా చర్చనీయాంశమైంది.

ప్రజల విజయమిది
ఈ సందర్భంగా మీడియాతో ఆచార్య మాట్లాడుతూ ఈ తీర్పు ఒడిశాలోని 4.5 కోట్ల మంది ప్రజల విజయమన్నారు. సాధారణంగా బీజేడీ ప్రభుత్వం 2024 అక్టోబర్‌ వరకు సమస్యను వాయిదా వేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఈ తీర్పుతో రత్న భాండాగారాన్ని తిరిగి తెరవడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే సమీర్‌ మొహంతి పిల్‌ దాఖలు చేశారన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను కూడా కోర్టు తిరస్కరించిందని తెలియజేశారు. రత్న భాండాగార్‌ భద్రత పురావస్తు సర్వే ఆఫ్‌ ఇండియా (అఐ)పై ఆధారపడి ఉంటుందన్నారు. తనిఖీ కోసం వీలైనంత త్వరగా తెరవాలని అఐ తన అఫిడవిట్‌లో స్పష్టం చేసిందన్నారు. ఏఎస్‌ఐతో ఏకీభవించిన హైకోర్టు రెండు నెలల్లోగా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement