
జయపురం: స్థానిక విమానాశ్రయం ఏపీడీ మోహన్ పొరిడ, అతడి భార్యపై ఒక యువతి జయపురం మహిళ పోలీసుస్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేసింది. విమానాశ్రయంలో పనిచేస్తున్న సదరు యువతి తనను శారీరక, మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. జయపురం రోడ్లు, భవనాల విభాగం ద్వారా ఔట్ సోర్సింగ్‌లో ఆ యువతి స్థానిక విమానాశ్రయంలో పనిచేస్తోంది. అయితే ఆమె పనిచేస్తున్న సమయంలో ఏపీడీ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపించింది.
అంతేకాకుండా ఏపీడీ తనను అతని ఇంట్లో పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు వాపోయింది. ఉద్యోగం పోతుందనే భయంతో మరో గత్యంతంలేక ఏపీడీ ఇంట్లో సైతం పనిచేస్తున్నట్లు తెలిపింది. ఆ సమయంలో అతడి భార్య లీనా తనను అసభ్యపదజాలం, కులం పేరుతో దూషిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు ఏపీడీ మోహన పొరిడ, అతడి భార్య లీనాలను ప్రశ్నిస్తున్నారు. డీఎస్పీ బిరంచి నారాయణ జగతో దర్యాప్తు చేపట్టారు. విమానాశ్రయ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఈశ్వర తండి సైతం ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. అయితే మహిళ చేసిన ఆరోపణలను ఏపీడీ మోహన పొరిడ ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment