చీపురుపల్లి: గ్రామీణ విద్యుత్ సహకార సంఘం (ఆర్‌ఈసీఎస్) పరిధిలో కొన్నేళ్ల క్రితం నియామకాలు జరిగి ప్రస్తుతం విధుల్లో ఉన్న ఆరుగురు ఎనర్జీ అసిస్టెంట్లకు నోటీసులు జారీ చేసినట్లు ఆ సంస్థ ఎం.డి. పి.రమేష్ తెలిపారు. తప్పుడు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదులు అందడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆరుగురు ఉద్యోగులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. వారి విద్యార్హత ధ్రువీకరణ పత్రాలపై సంబంధిత ఉద్యోగులు వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆర్‌ఈసీఎస్ పరిధిలో 59 మంది ఎనర్జీ అసిస్టెంట్ల నియామకాలు గతంలో జరిగినట్లు చెప్పారు. వారిలో ఆరుగురు మాత్రమే ఇతర రాష్ట్రాల్లో తప్పుడు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు నమోదైందన్నారు. తాజాగా ఇచ్చిన నోటీసులకు సంబంధిత ఉద్యోగులు ఇచ్చిన సమాధానం ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు.
జీబీఎస్ వ్యాధిపై ఆందోళన వద్దు
విజయనగరం ఫోర్ట్: గులియన్ బర్రీ సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వైద్యాధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాధిని ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. వ్యాధి నిర్ధారణ, కట్టడిచేయడానికి అవసరమైన ల్యాబ్‌లు, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని తెలిపారు. పరిశుభ్రమైన తాగునీరు, ఆహారాన్ని తీసుకోవాలన్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. తాగునీటి పథకాలను షెడ్యూల్ ప్రకారం క్లోరినేషన్ చేయాలని, నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్. జీవన రాణి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సంబంగి అప్పలనాయుడు మాట్లాడుతూ వ్యాధి సోకితే కాళ్లు, చేతులు బలహీన పడడం, చలనం తగ్గిపోవడం, కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. ఈ వ్యాధి 80 శాతం మందికి సహజంగానే తగ్గిపోతుందన్నారు. 15 శాతం మందికి చికిత్స అవసరమని, కేవలం 5 శాతం మందికి మాత్రమే పరిస్థితి విషమంగా మారుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment