హరిపురంలో వేంకటేశ్వర మందిర ప్రతిష్ట
పర్లాకిమిడి: కాశీనగర్ సమితి ఖండవ గ్రామ పంచాయితీ హరిపురం గ్రామంలో వేంకటేశ్వరస్వామి మందిర ప్రతిష్టా మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు, రోక్కం సతీష్, రామచంద్రుడు, జ్యోతి, అధికసంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. ప్రతిష్టలో భాగంగా యజ్ఞపూజలు జరిగాయి.
గుర్తు తెలియని మృతదేహం కలకలం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని హయాతినగరం సమీపంలో నాగావళి నదీ తీరంలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. వ్యక్తి ఎడమ చేతి భుజంపై మహిళ బొమ్మ, డి.లక్ష్మి అనే అక్షరాలు పచ్చబొట్టుగా వేసి ఉన్నాయని ఒకటో పట్టణ ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు. బాగా కుళ్లిన స్థితిలో ఉండటంతో సుమారు ఐదు రోజులు కిందట వ్యక్తి చనిపోయి ఉంటాడని, వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నామన్నారు. స్థానిక వీఆర్వో ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలిని పరిశీలించామని, పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించామని చెప్పారు. వివరాలు తెలిస్తే ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తెలియజేయవచ్చన్నారు.
విద్యార్థిని ఆత్మహత్య
కాశీబుగ్గ: మందస మండలం లోహరిబంద గ్రామంలో ఎనిమిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కర్రి అనూష (14) లోహరిబంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటికి వెళ్లిపోయింది. ఏం జరిగిందో గానీ ఇంటి పక్కనున్న తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని వెతుక్కుంటూ వెళ్లిన ఉపాధ్యాయులు చెట్టుకు వేలాడటం చూసి నిర్ఘాంతపోయారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment