ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు పక్కా ఏర్పాట్లు
మహారాణిపేట : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఏఆర్వోలను ఆదేశించారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. ఎన్నిక నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో వ్యవహరించి ఎన్నికను ప్రశాంతంగా జరిగేలా చూడాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, జాబితా రూపకల్పన, బ్యాలెట్ పేపరు తయారీ, గుర్తుల కేటాయింపు తదితర అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. సాంకేతికపరమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలన్నారు. పోలింగ్ మెటీరియల్ అందజేత, స్వీకరణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. పోలింగ్ ముందు రోజే సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు తెలపాలని, కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏఆర్వోలు, పోలీసు అధికారులు అక్కడి పరిస్థితులను రిటర్నింగ్ అధికారికి వివరించారు. విశాఖ జిల్లా ఏఆర్వో బిహెచ్.భవానీ శంకర్, అల్లూరి జిల్లా ఏఆర్వో పద్మలత, అనకాపల్లి జిల్లా ఏఆర్వో పీవీఎస్‌ఎస్‌ఎన్ సత్యనారాయణ, విజయనగరం జిల్లా ఏఆర్వో శ్రీనివాసమూర్తి, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల ఏఆర్వోలు పాల్గొన్నారు.
హామీలు అమలు కోరుతూ పోస్టుకార్డు ఉద్యమం
శ్రీకాకుళం న్యూకాలనీ : కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. లేకుంటే ఉద్యమాలు తప్పవని ఎస్‌టీయూ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎస్.వి.రమణమూర్తి అన్నారు. శుక్రవారం నగరంలోని క్రాంతి భవన్‌లో అత్యవసర కార్యవర్గ సమావే శం నిర్వహించారు. అప్పటి ప్రతిపక్షనేతగా చంద్రబాబునాయుడు ఉపాధ్యాయ ఉద్యోగవర్గాల కు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రికి ఎస్టీయూ సంఘం తరఫున పోస్టుకార్డులు పంపే ఉద్యమాన్ని ప్రారంభించారు. వెంటనే పీఆర్సీని అమలుపర్చేలా చర్యలు చేపట్టాలని, ఐఆర్‌ను తక్షణమే ప్రకటించాలని, పెండింగ్ బకాయిలు, పెండింగ్ డీఏలను ప్రకటించాలని కోరారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుగుబెల్లి రమణ, శ్రీనివాసరావు, రామారావు, శ్రీధర్, తేజ, లక్ష్మణరావు, వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment