హరా..కనరా
● సమస్యల వలయంలో గుప్తేశ్వర్ పుణ్యక్షేత్రం
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి గుప్తేశ్వర్ పుణ్యక్షేత్రం సమస్యల వలయంలో కొట్టుమిట్లాడుతోంది. మహాశివరాత్రి కేవలం 6 దినాలే ఉన్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారులు గుప్తేశ్వరలో మహాశివరాత్రి ఉత్సవాలకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే సమస్యలను విస్మరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. బొయిపరిగుడ నుంచి గుప్తేశ్వర్ వరకు గల 35 కిలోమీటర్ల పొడుగునా రోడ్డు ఇరుపక్కల వేలాది చెట్లు ఉన్నాయి. వాటిలో అత్యధికం పడిపోయే స్థితిలో ఉన్నాయి. ఎండి పడిపోయే స్థితిలో ఉన్న చెట్లు తొలగించకపోతే భక్తులకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఇదే మార్గంలో డొకిరీ,డొకరా ఘాట్‌లు ప్రమాదాలకు అడ్డాలుగా మారాయి. ఆ ప్రాంతాల్లో భక్తుల భధ్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. శబరీ నది ఘాట్ రోడ్డు అతి శోచనీయంగా ఉందని, అలాగే గుప్తేశ్వర్‌లో చెత్త కుప్పలు దుర్గంధాన్ని వెదజలుతున్నాయని వాటిని తొలగించి పారిశుద్ధ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. గుప్తేశ్వర్‌లో టెలిఫోన్ నెట్‌వర్క్ పాడైపోయిందని 6 నెలల కిందట నెట్‌వర్క్ టవర్ బ్యాటరీ కాలిపోవటంతో నెట్‌వర్క్ పనిచేయటం లేదని అందువలన ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారని, నెట్‌వర్క్ పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. గుప్తేశ్వర్‌లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, శిఱిగుడలో ఉన్న ఒక బోర్‌వెల్ నుంచి తాగునీరు సరఫరా చేస్తున్నారని, ఒక వేళ విద్యుత్‌కు అంతరాయం ఏర్పడితే తాగునీటి సరఫరా నిలిచిపోతుందని స్థానికులు చెబుతున్నారు. భక్తులకు రక్షిత తాగునీటి వనరులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే విద్యుత్ సౌకర్యానికి అంతరాయం ఏర్పడకుండా తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కేవలం 25 శౌచాలయాలు మాత్రం ఏర్పాటు చేస్తున్నారని, అవి భక్త జనాలకు సరిపోవని అందువల్ల మరికొన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ప్రజలు సూచిస్తున్నారు. గుప్తేశ్వర్‌లో 40 దుకాణాలు ఉన్నాయి. మరో 80 స్టాల్సు నిర్మాణంలో ఉన్నాయి. వాటిని వెంటనే పూర్తి చేయక పోతే భక్తులకు పూజా సామగ్రి, ఆహార దినుసులు అమ్మే వ్యాపారులు ఇబ్బందులు పడతారని అందువలన భక్తులకు అవసరమైన వస్తువులు లభించవని, అందుచేత వ్యాపారులకు అవసరమైన స్టాల్సు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. శబరీ నదిపై తాత్కాలిక వంతెన భక్తులు నది దాటేందుకు ఉందని, ముఖ్యంగా చత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి వచ్చే వేలాది మంది భక్తులు తాత్కాలిక వంతెనే ఆధారమని, ఇకనైనా పర్మినెంట్ వంతెన చేయాలని సూచించారు. భక్తలకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు తగినన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, అలాగే భక్తుల కోసం జయపురం నుంచి తగినన్ని బస్సులు వేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment