విద్యార్థి మరణంపై సభలో రచ్చ
భువనేశ్వర్: స్థానిక కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కిట్) విశ్వవిద్యాలయ విద్యార్థిని అకాల మరణంపై శాసనసభ సమావేశాల్లో రచ్చ రేగింది. అంతర్జాతీయ విద్యార్థుల భద్రత, శ్రేయస్సుపై నమ్మకం లోపించి ఆందోళనలను రేకెత్తించింది. కిట్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న నేపాల్‌కు చెందిన విద్యార్థుల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు మానసిక సంక్షోభానికి దారి తీసి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుందనే ఆరోపణలపై కొనసాగుతున్న నిరసనల మధ్య శుక్రవారం శాసన సభలో ప్రతిపక్ష కాంగ్రెసు తీవ్రంగా విరుచుకు పడింది. నేపాలీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న తర్వాత కిట్ విశ్వవిద్యాలయంలో అశాంతి చెలరేగిందని, ఈ పరిస్థితిపై సభలో చర్చ జరగాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఈ అభ్యర్థన మేరకు సభాపతి చర్చకు అనుమతించారు. రాష్ట్ర శాసన సభలో ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా ఉన్నత విద్యా శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి విచారణ కమిటీ ముందు హాజరుకావాలని కిట్ వ్యవస్థాపకుడు, మాజీ బిజూ జనతా దళ్ ఎంపీ అచ్యుత సామంతతో సహా ఎనిమిది మంది అధికారులు ఉన్నత స్థాయి కమిటీ ఆదేశించినట్లు విభాగం మంత్రి తెలిపారు. ఈ కమిటీ ఇటీవల స్థానిక కిట్ విశ్వ విద్యాలయం సందర్శించి దర్యాప్తు ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment