పెద్దలు అంగీకరించలేదని..ప్రేమజంట ఆత్మహత్య
రాయగడ: వారిద్దరూ మూడేళ్లుగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఒకరంటే మరొకరికి ఎంతో ఇష్టం. పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. అయితే ఇరుకుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దీంతో కలిసి జీవించకపోయినా కలిసి చనిపోవాలని అనుకున్నారు. మామిడిచెట్టు కొమ్మకు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాద ఘటన రాయగడ జిల్లాలోని కాసీపూర్ సమితి మైకంచ్ పంచాయతీ పరిధి కొటాలి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడింది అదే గ్రామానికి చెందిన దాయిమతి జొడియా (20), భరత్ సాహు(20)లుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొటాలి గ్రామంలో నివసిస్తున్న దాయిమతి జొడియా, భరత్ సాహు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని కలలుకన్నారు. అయితే వీరి ప్రేమ గురించి పెద్దలకు తెలియజేయడంతో పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన దాయిమతి జొడియా, భరత్ సాహు కొటాలి గ్రామానికి సమీపంలోని ఒక మామిడి చెట్టుకు ఉరి వేసుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. అటువైపుగా వెళ్లిన కొందరు చెట్టుకొమ్మకు వేలాడుతున్న మృతదేహాలను చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం టికిరి ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొటాలి గ్రామంలో విషాదం
పెద్దలు అంగీకరించలేదని..ప్రేమజంట ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment