జన హృదయ నేత బిజూ
భువనేశ్వర్: రాష్ట్ర చరిత్రకారునిగా పేరొందిన దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ పట్ల రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అగౌరవ భావం ప్రదర్శించిందని విపక్ష నేత నవీన్ పట్నాయక్ తీవ్ర మనస్తాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు రావొచ్చు, పోవచ్చు కానీ ఒడియా ప్రజల హృదయాల్లో బిజూ పట్నాయక్ చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. బిజూ పట్నాయక్ విలువని దిగజార్చే ప్రయత్నాలు జరగడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు. బిజూ బాబు జాతీయ నాయకుడు కాదు, అంతర్జాతీయ నాయకుడని గుర్తు చేశారు. స్థానిక శంఖ్ భవన్‌లో బుధవారం నిర్వహించిన బిజూ జయంతి సభలో పాల్గొని నవీన్ పట్నాయక్ ప్రసంగించారు. కాగా, ఏటా మార్చి 5వ తేదీన బిజూ జయంతి పురస్కరించుకుని నిర్వహించే పంచాయతీరాజ్ దివస్ వేడుకలను వేరే తేదీకి మార్చడంపై బిజూ అభిమానులు, అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి రగులుతోంది. ప్రభుత్వాల మార్పు చేర్పులతో చరిత్రకారుల ఘనత నీరుగారిపోయే విచారకర పరిస్థితులు ఎన్నడు చూడనట్లు ఈ వర్గం వ్యాఖ్యానిస్తోంది.
బిజూ పట్నాయక్‌కు ఘన నివాళులు
రాయగడ: ఒడిశా వరపుత్రుడు, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ బిజూ పట్నాయక్ 109వ జయంతిని బీజేడీ పార్టీ శ్రేణులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక కొత్త బస్టాండు వద్ద గల బీజూ పట్నాయక్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక, సీనియర్ నాయకులు బ్రజసుందర్ నాయక్, సుజాత పాలొ, అనసూయా మాఝి, మున్సిపల్ చైర్మన్ మహేష్ పట్నాయక్, కార్యకర్తలు పాల్గొన్నారు.
పర్లాకిమిడిలో...
పర్లాకిమిడి: బిజూ పట్నాయిక్ జయంతి సందర్భంగా పర్లాకిమిడి హైస్కూల్ జంక్షన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి బీజేడీ నాయకులు, ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి పూలదండలు వేసి నివాళులర్పించారు. బిజూ పట్నాయక్ అమర్ రహే అని నినదించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు ఎమ్మెల్యే రూపేష్ పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. హైటెక్ ప్లాజాలోని బీజేడీ పార్టీ కార్యాలయంలో బీజూ పట్నాయక్ జయంతి సందర్భంగా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతిరావు, రాష్ట్ర బీజేడీ సాధారణ కార్యదర్శి ప్రదీప్ నాయక్, బసంత్ దాస్, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, పట్టణ బీజేడీ అధ్యక్షులు సితేంద్ర మహాపాత్రో, జెడ్పీటీసీ సభ్యుడు (గుసాని) యస్.బాలరాజు, గుసాని సమితి అధ్యక్షులు ఎన్.వీర్రాజు, కాశీనగర్ ససిమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ పాల్గొన్నారు.
ఫారెస్టు పార్కులో శ్రద్ధాంజలి..
స్థానిక ఫారెస్ట్ పార్క్‌లో జరిగిన బిజూ జయంతి వేడుకల్లో ప్రతిపక్ష నాయకుడు, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. బిజూ పట్నాయక్‌కు నివాళులు అర్పిస్తూ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని గుర్తించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. 1993 నుంచి చరిత్రాత్మకంగా జరుపుకునే ఒక రోజుకు గుర్తింపుని తొలగించడం విచారకరమన్నారు. క్రీడా అవార్డులు, విమానాశ్రయం వంటి ప్రముఖ సంస్థల పేర్లుని రాష్ట్ర ప్రభుత్వం మార్చే ప్రయత్నాలపై నవీన్ ఘాటుగా స్పందించారు. బిజూ బాబు విగ్రహం విధ్వంసానికి పాల్పడిన వారి వ్యతిరేకంగా బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. దివంగత నేత బిజూ పట్నాయక్ ఆవిష్కరించిన పారాదీప్ పోర్టు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్), తాల్చేరు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ), రౌర్కెలా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వంటి ముఖ్యమైన పారిశ్రామిక మరియు విద్యా సంస్థలను మూసివేయగలరా? అని నవీన్ బీజేపీకి సవాల్ విసిరారు. ప్రస్తుత పరిపాలన సంకుచిత దృక్పథంతో కూడిన రాజకీయాలతో కొనసాగుతోందని విమర్శించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను స్థాపించడం నుంచి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే దిశలో బిజూ పట్నాయక్ కృషి చిరస్మరణీయమని గుర్తు చేశారు. ఒడిశా అభివృద్ధిలో బిజూ పట్నాయక్ పాత్రను, ఇండోనేషియా స్వాతంత్య్ర పోరాటానికి మద్దతు ఇవ్వడం, యునెస్కో కళింగ అవార్డు వంటి అంతర్జాతీయ సహకారాలను ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ గుర్తు చేశారు.
జన హృదయ నేత బిజూ
జన హృదయ నేత బిజూ
జన హృదయ నేత బిజూ
Comments
Please login to add a commentAdd a comment