త్వరలో జగన్నాథ్ సాగర్ పునరుద్ధరణ పనులు
జయపురం: జయపురంలో చారిత్రిక జగన్నాఽథ్ సాగర్ పురుద్ధరణ, సౌందర్యీకరణ పనులు పది రోజుల్లో పునఃప్రారంభం కానున్నాయని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి వెల్లడించారు. బుధవారం జయపురంలోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. పునరుద్ధరణ పనుల కోసం గత నెల 24వ తేదీన ప్రభుత్వం రూ. 9.25 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గతంలో సాగర్ పునరుద్ధరణ పనులను మహిళా స్వయం సహాయక గ్రూపువారు చేపట్టారని.. అయితే నిధుల కొరత కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయినట్టు వివరించారు. ఆ పనులలో అవినీతి జరిందని కొంతమంది ఆరోపించారని అన్నారు. ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఒక కమిటీని వేసిందన్నారు. ఆ కమిటీ తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించిందని.. సాగర్ పనులలో ఎటువంటి అవినీతి జరుగలేదని వెల్లడైందని ఎమ్మెల్యే వివరించారు. మూడు నెలల్లో పునరుద్ధరణ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాగర్ సౌందర్యీకరణ పనులు పూర్తయితే జగన్నాథ్ సాగర్‌ను ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా రూపొందించగలమన్నారు. జగన్నాథ్ సాగర్ నాలుగు వైపులా గతంలో ఆక్రమణలు జరిగాయని..అయితే అప్పట్లో నోరు విప్పనివారు నేడు విమర్శలు చేయడం తగదన్నారు. ఆ నాడు తాను ఆక్రమణలను వ్యతిరేకించానని కాని ప్రభుత్వం మిన్నకుందని వెల్లడించారు. మత్య్స విభాగం ఆధీనంలోని 25 ఎకరాల సాగర్ స్థలం సాగర్‌లో మమేకం చేస్తామని వెల్లడించారు. జగన్నాథ్ సాగర్ సౌందర్యీకరణ, ఉన్నతే తన ధ్యేయమన్నారు. సమావేశంలో జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నిహార్ బిశాయి పాల్గొన్నారు.
త్వరలో జగన్నాథ్ సాగర్ పునరుద్ధరణ పనులు
Comments
Please login to add a commentAdd a comment