దోపిడీ దొంగల అరెస్టు
జయపురం: కత్తితో బెదిరించి డబ్బులు దోచుకున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు జయపురం పట్టణ పోలీసు అధికారి ఈశ్వర తండి బుధవారం వెల్లడించారు. అరెస్టయిన వారిలో ఒడియామేదరి వీధికి చెందిన సునీల్ పొరజ అలియాస్ లాలు, సౌరగుడ సమీపంలో ఉంటున్న ప్రభీర్ హరిజన్ ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 1న బొరిగుమ్మ సమితి సేమలగుడ పంచాయతీ నకులగుడ గ్రామానికి చెందిని జుధిష్టర్ మాలి స్నేహితుడు బైక్ సర్వీసింగ్ కోసం జయపురం వచ్చాడు. బైక్ సర్వీసింగ్ అనంతరం మధ్యాహ్నం భోజనం చేసి తమ గ్రామానికి బయలుదేరాడు.ఆ సమయంలో జయపురం గాంధీ చౌక్ సమీపంలో ముగ్గురు దుండగులు స్కూటీపై వచ్చారు. జుధిస్టర్‌ను ఫోన్ ఇచ్చేయాలని బెదిరించారు. అందుకు అంగీకరించకపోవడంతో అతడిని కొట్టి అతడి చేతులు వెనక్కి విరచి కత్తి చూపి ఏడు వేల రూపాయలు దోచుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అక్కడి సీసీ టీవీలను పరిశీలించి దుండగులు వచ్చిన స్కూటీ నంబర్ ఆధారంగా యజమానిని గుర్తించారు. అతడిని ప్రశ్నించగా తెలిసిన వ్యక్తికి స్కూటీ ఇచ్చానని వెల్లడించాడు. తమదైన శైలిలో పోలీసులు ప్రశ్నించగా దోపిడీ సూత్రధారి సునీల్ పొరజ అని గుర్తించారు. బైక్‌లు తీసుకెళ్లి దొంగతనాలు చేయడం సునీల్‌కు అలవాటని, గతంలోనూ ఇలా దొంగతనాలు చేశాడని పోలీసు అధికారి వెల్లడించారు. అతడితో పాటు ప్రభీర్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. కేసుని ఏఎస్‌ఐ రమేష్ చంద్ర మహాపాత్రో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
దోపిడీ దొంగల అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment