పన్నుల చెల్లింపులో నెల్లిమర్ల ఫస్ట్
● పట్టణాల్లో ఆస్తి పన్ను వసూళ్లలో
అధికారులు బిజీ
● 73.96 శాతం వసూళ్లతో నెల్లిమర్ల
నగర పంచాయతీ ముందంజ
● నాలుగు పట్టణాల్లో పన్ను డిమాండ్ రూ.51.37 కోట్లు
● ఇప్పటివరకు వసూలైనది
రూ.28.56 కోట్లు
● బకాయిదారులకు రెడ్ నోటీసులు
జారీ చేస్తున్న యంత్రాంగం
విజయనగరం: ఆస్తి పన్ను చెల్లింపులో నెల్లిమర్ల నగరపంచాయతీ ప్రజలు జిల్లాలో ముందంజలో ఉన్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు (మార్చి 31) దగ్గర పడుతుండడంతో ఆస్తి పన్ను వసూళ్లలో కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీ అధికారులు నిమగ్నమయ్యారు. మొండిబకాయిల వసూళ్లే లక్ష్యంగా నోటీసులు జారీ చేస్తున్నారు. పన్నులు చెల్లించి పట్టణాల అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నారు. విజయనగరం జిల్లా పరిధిలోని విజయనగరం కార్పొరేషన్‌తో పాటు బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల, రాజాం నగర పంచాయతీల్లో 2024–25 ఆర్థిక సంవత్సరానికి డిమాండ్ రూ.51.37 కోట్లు కాగా ఇప్పటివరకు రూ.28.56 కోట్లు వసూలు చేశారు. మొత్తం డిమాండ్‌లో 55.59 శాతం మున్సిపల్ ఖజానాకు చేరింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మొదటి విడత, అక్టోబర్ నుంచి మార్చి వరకు రెండో విడతగా పన్నులు వసూలు చేయడం సహజం. ఇప్పటి వరకు నెల్లిమర్ల నగర పంచాయతీ 73.96 శాతం వసూళ్లు చేసి మొదటి స్థానంలో నిలవగా.. 60.91 శాతం వసూళ్లతో బొబ్బిలి మున్సిపాలిటీ రెండవ స్థానంలో, 59 శాతం వసూళ్లతో రాజాం మూడవ స్థానంలో, 53.95 శాతం వసూళ్లతో విజయనగరం కార్పొరేషన్ చివరి స్థానంలో ఉంది. నీటిపన్ను వసూళ్లలో సైతం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేదు. సిబ్బందిపై ఉన్నతాధికారులు ఒత్తిడి పెంచడంతో క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి పన్నుల వసూళ్లకు శ్రీకారం చుట్టారు.
● బకాయిదారులపై కొరడా..
ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండడంతో పన్నుల వసూలుకు బకాయిదారులపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. మొండి బకాయిదారుల జాబితాను సిద్ధంచేసి రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు. అప్పటికీ స్పందించకుంటే ఇంటికి వేసిన తాగునీటి కుళాయి కనెక్షన్లను తొలగిస్తున్నారు. పన్ను బకాయి దారుల జాబితాలను కార్పొరేషన్/మున్సిపల్ కార్యాలయాలతో పాటు అన్ని సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. దీర్ఘకాలికంగా బకాయిపడిన వారి దుకాణాలను సీజ్ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పన్నుల వసూళ్లపై యంత్రాంగం ఒత్తిడి చేస్తోందన్న చర్చ పట్టణాల్లో సాగుతోంది.
పన్నలు చెల్లించాలి
స్థానిక సంస్థల అభివృద్ధికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయమే కీలకం. ఆదాయం వస్తేనే అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆస్కారం ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతోంది. ప్రజలంతా సహకరించి పన్ను బకాయిలు చెల్లించాలి. ఆన్‌లైన్‌లోను, మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో పన్ను చెల్లించి రసీదు పొందాలి. లేని పక్షంలో మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం.
– పల్లి నల్లనయ్య, కమిషనర్,
విజయనగరం కార్పొరేషన్
పన్నుల చెల్లింపులో నెల్లిమర్ల ఫస్ట్
పన్నుల చెల్లింపులో నెల్లిమర్ల ఫస్ట్
పన్నుల చెల్లింపులో నెల్లిమర్ల ఫస్ట్
పన్నుల చెల్లింపులో నెల్లిమర్ల ఫస్ట్
Comments
Please login to add a commentAdd a comment